అనారోగ్యాలు తొలగించే ఆంజనేయుడు
లోక కల్యాణం కోసం శ్రీమహావిష్ణువు రామావతారాన్ని ధరిస్తాడు. రామావతార కార్యం ఏమిటనేది శివుడికి తెలుసు. త్రిపురాసుర సంహార సమయంలో విష్ణువు తనకి సహకరించినందుకుగాను, రామావతార కార్యంలో ఆయనకి సహాయపడాలని శివుడు నిర్ణయించుకుంటాడు. అలా శివాంశ సంభూతుడిగా శ్రీరాముడికి అండగా నిలిచినవాడే హనుమంతుడు. అందుకే విష్ణు స్వరూపుడైన రాముడంటే హనుమంతుడికి ప్రాణమని చెబుతారు.
అలాంటి హనుమంతుడికి సాక్షాత్తు సూర్యభగవానుడే గురువు. ఇక సమస్త దేవతల ఆశీస్సులు ఆయనకి బాల్యంలోనే లభించాయి. చిరంజీవిగా వరాన్ని పొందిన ఆయన ఇప్పటికీ తన భక్తులను ప్రత్యక్షంగా అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఈ కారణంగానే అనేక ప్రాంతాల్లో ఆయన ఆలయాలు అలరారుతున్నాయి. అలాంటి విశిష్టమైన ఆలయాల్లో ఒకటి 'రావులపెంట' లో దర్శనమిస్తుంది.
ఈ గ్రామం నల్గొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలో వుంది. ఇక్కడి చెరువుగట్టున స్వామి 'వీరాంజనేయుడు' గా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. వందల సంవత్సరాల చరిత్రను కలిగిన ఇక్కడి స్వామిని దర్శించుకున్న భక్తులు, స్వామి అనుగ్రహాన్ని పొందకుండా వెనుదిరగరని స్థానికులు చెబుతుంటారు.
చాలాకాలంగా అనారోగ్యాలతో బాధలు పడుతోన్నవాళ్లు ... పీడకలలతో నిద్రకు దూరమై మానసికంగా కుంగిపోతోన్నవాళ్లు ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వలన మంచి ఫలితం కనిపిస్తుందని అంటారు. ఇలా వివిధ రకాల సమస్యలతో స్వామి పాదాలను ఆశ్రయించిన భక్తులు అనతికాలంలోనే వాటి బారి నుంచి విముక్తిని పొందుతూ ఉండటం విశేషం. అందుకే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడి హనుమంతుడికి సిందూర అభిషేకాలు జరిపిస్తుంటారు. ఆయనకి ఎంతో ప్రీతికరమైన వడ మాలలు సమర్పిస్తూ ఉంటారు.