దోషాలను నివారించే నరసింహుని దివ్యక్షేత్రం

లక్ష్మీనరసింహస్వామి ఆవిర్భవించిన కొన్ని క్షేత్రాలను పరిశీలిస్తే, ముందుగా ఆయన ఒకచోట ఆవిర్భవించి ఆ తరువాత మరో ప్రదేశానికి మారిన సందర్భాలు కనిపిస్తాయి. అలా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి మారిన లక్ష్మీనారసింహుడు మనకి 'అరవపల్లి' క్షేత్రంలో దర్శనమిస్తాడు.

నల్గొండ జిల్లా పరిధిలో గల ఒక మండల కేంద్రంగా, సూర్యాపేట నుంచి జనగామ వెళ్లే దారిలో పాతిక కిలోమీటర్ల దూరంలో అరవపల్లి కనిపిస్తుంది. ఇక్కడి యోగానంద లక్ష్మీనరసింహస్వామి కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో గల పెద్దగుట్టపై ఆవిర్భవించాడట. ఆ తరువాత ఆ పక్కనే గల చిన్నగుట్టపై కొంతకాలం ఉన్నతరువాత ప్రస్తుతం ఉన్న ప్రదేశానికి వచ్చాడని అంటారు.

గతంలో స్వామివారు ఇక్కడి గుట్టలపై ఆవిర్భవించాడని అనడానికి కూడా ఆనవాళ్లు ఉన్నాయని చెబుతారు. నరసింహస్వామి యోగానందుడుగా ఉన్నందువలన ఈ క్షేత్రంలో చేసే జపతపాలు సిద్ధిస్థాయని అంటారు. ఇక స్వామి సన్నిధిలోనే ఒక పుట్ట ఉంటుంది. ఇందులోని సర్పం ఈ క్షేత్రాన్ని కాపాడుతూ ఉంటుందని చెబుతారు. ఈ కారణంగానే ఈ క్షేత్రంలో చేసే పూజల వలన నాగదోషం కూడా తొలగిపోతుందని అంటారు.

ప్రతియేటా మాఘశుద్ధ పౌర్ణమి రోజున లక్ష్మీ నరసింహులకు కళ్యాణ మహోత్సవం జరిపించబడుతుంది. స్వామివారు - అమ్మవారి ఉత్సవ మూర్తులను ముస్తాబుచేసి సమీపంలో గల జాజిరెడ్డి గూడెం నుంచి తీసుకురావడం తరతరాలుగా వస్తోంది. పద్ధెనిమిది రోజులపాటు జరిగే ఇక్కడి తిరునాళ్లకి పరిసర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధికసంఖ్యలో వస్తారు. అంగరంగ వైభవంగా జరిగే స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని దర్శించుకుని తరిస్తారు.


More Bhakti News