భక్తులను కనిపెట్టుకునుండేది భగవంతుడే
ఎవరు ఎవరినీ కనిపెట్టుకుని ఉండలేరు ... ఎవరు ఎవరినీ రక్షించనూ లేరు. అందరినీ కనిపెట్టుకుని ఉండేది ... వెన్నంటి నడిపించేది ఆ భగవంతుడే. శబరిమల యాత్ర సమయంలో ఈ విషయం మరోమారు స్పష్టమవుతూ ఉంటుంది. శబరిమలలో స్వామి సన్నిధానానికి చేరుకోవడం అంత ఆషామాషీ విషయం కాదు. అడవులు ... కొండలు ... ఇరుకైన రాళ్లదారులు భక్తులకు పరీక్ష పెడుతుంటాయి.
దీక్ష ధారణ చేసిన భక్తులు పద్ధెనిమిది కొండలు దాటవలసి ఉంటుంది. వీటిలో 'కరిమల'ను అధిరోహించడం ఎంతో కష్టమని చెబుతుంటారు. ఈ కొండను ఎక్కడం ఎంతకష్టమో ... దిగడం కూడా అంతే కష్టమని అంటారు. ఎంతో నియమనిష్టలతో దీక్షా కాలాన్ని కొనసాగిస్తోన్న స్వాములు మాత్రమే కరిమలను అధిరోహించగలరు.
ఇక అనారోగ్య కారణాల వలన ఎవరైనా ఈ కొండను అధిరోహించలేకపోతే, వాళ్లని ఈ కొండ దాటించే బాధ్యతను సాక్షాత్తు అయ్యప్పనే తీసుకుంటాడని అంటారు. అంతటి ఎత్తయిన ఈ కొండపై ఒక 'బావి' కనిపిస్తుంది. అత్యంత కష్టతరమైన దారిలో ప్రయాణం చేస్తూ అలసిన భక్తులు దాహం తీర్చుకోవడం కోసం అయ్యప్ప స్వామియే ఈ బావిని ఇక్కడ నిర్మించాడట.
అయ్యప్పస్వామి బాణం 'మొన' తగిలిన ప్రదేశం నుంచి పుట్టిన జలధార కనుక ఈ బావి ఇంతవరకూ ఎండిపోవడం జరగలేదని అంటారు. తన భక్తుల కోసం స్వామి ఇంతగా ఆలోచిస్తాడని ఈ బావి చెప్పకనే చెబుతుంటుంది. దాంతో శరీరం ... మనసు మరింత ఉత్తేజితమై ఈ కొండను తేలికగా దాటడానికి కారణమవుతుంది. స్వామి తమని కనిపెట్టుకుని ఉండటం వల్లనే తాము ఈ కొండను దాటగలిగామనే విషయం అర్థమవుతుంది.