భగవంతుడి చూపు సోకితే చాలు
ఆంగ్లేయుల పాలనా కాలంలో ఎంతోమంది అధికారులు తమ పదవీ నిర్వహణలో భాగంగా ఇక్కడి ఆలయాలను దర్శించారు. ఇక్కడి ప్రజల భక్తి శ్రద్ధలను మూఢ విశ్వాసాలుగా భావించిన వాళ్లు, ఆ తరువాత నిజం తెలుసుకుని భక్తులుగా మారిపోయిన సందర్భాలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. అలాంటివాటిలో థామస్ మన్రో మంత్రాలయ దర్శనం ఒకటిగా కనిపిస్తూ ఉంటుంది.
మంత్రాలయ భూముల వివరాలను పరిశీలించి ... ఆ భూములకు సంబంధించిన ఆధారాలు సరిగ్గా లేకపోతే వాటిని ప్రభుత్వపరం చేయాలనే పనిపై థామస్ మన్రో అధికార హోదాలో మంత్రాలయం వస్తాడు. అయితే గతంలో ఆదోని నవాబు ... రాఘవేంద్రస్వామికి ఆ గ్రామాన్ని కానుకగా ఇచ్చినట్టు తెలిపే పత్రాలు ప్రస్తుతం మఠంలో లేకపోవడంతో మన్రో తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. ప్రభుత్వం తన పని తను చేసుకుపోక తప్పదని అంటాడు.
అందరూ గొప్పగా చెబుతోన్న రాఘవేంద్రస్వామి బృందావనం చూడాలనే ఉద్దేశంతో అక్కడికి వస్తాడు. బృందావనాన్ని చూడగానే ఆయన ఆవేశం ఒక్కసారిగా తగ్గిపోతుంది. అప్రయత్నంగానే ఆయన రెండు చేతులు జోడించి నమస్కరిస్తాడు. ఏదో వింటున్నట్టుగా మౌనంగా కాసేపు నిలబడిన ఆయన ఆ తరువాత వినయంగా నమస్కరించి వెనుదిరుగుతాడు.
బృందావనంలో నుంచి ఒక దివ్యమైన రూపం వచ్చి తన ముందు నిలిచిందనీ, స్వామివారి మాటల వలన భూములకు సంబధించిన స్పష్టత వచ్చిందని మన్రో అంటాడు. తనని ఆశీర్వదించి స్వామి ఇచ్చాడంటూ తన చేతిలోని అక్షింతలు చూపుతాడు. అంతే అక్కడున్న వాళ్లంతా ఆనందాశ్చర్యాలతో పొంగిపోతారు. స్వామివారు చూపిన ప్రధానమైన మహిమలలో ఒకటిగా ఇప్పటికీ దీని గురించి చెప్పుకుంటూ ఉంటారు.