ఈ రోజున గణపతి ఆరాధన ఫలితం !

తలపెట్టిన కార్యక్రమాలన్నీ అనుకున్న విధంగా పూర్తవుతున్నప్పుడే జీవితం సాఫీగా కొనసాగుతూ ఉంటుంది. అలా కాకుండా ఏ కార్యక్రమాన్ని ఆరంభించినా అది మధ్యలోనే ఆగిపోతూ ఉంటే తీవ్రమైన అసంతృప్తి కలుగుతూ ఉంటుంది. ఒకవేళ అనుకున్న పనిలో అపజయం ఎదురైనా అసహనం కలుగుతూ ఉంటుంది. దాంతో జీవితం నిరాశా నిస్పృహలకు లోనవుతుంది.

ఇలాంటి సంకటాల నుంచి బయటపడటానికి దారిచూపే మార్గంగా 'సంకటహర చతుర్థి' కనిపిస్తుంది. ఈ రోజున వినాయకుడిని పూజించడం వలన ఆశించిన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సాధారణంగా వినాయకుడు లేని ఆలయాలుగానీ ... ఆయన నామం వినిపించని పూజగాని ... ఆయన చిత్రపటంలేని శుభకార్యంగాని కనిపించవు. అలాంటి వినాయకుడిని సంకటహర చతుర్థి రోజున విశేషంగా పూజిస్తూ ఉంటారు.

ఈ రోజు ఉదయాన్నే గణపతిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ఆయనకి ప్రీతిపాత్రమైన నైవేద్యాలను సమర్పిస్తారు. ఉపవాసదీక్షను చేపట్టి సాయంత్రం చంద్రోదయం అయిన తరువాత ఆయనని దర్శించి ఉపవాసదీక్షను విరమిస్తారు. ఇలా సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజించడం వలన కష్టాలు తొలగిపోయి శుభాలు చేకూరతాయి.

పరమశివుడు సైతం సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించే త్రిపురాసుర సంహారం చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు సాయంత్రానికి సదాశివుడికి ఇష్టమైన 'ఆరుద్ర నక్షత్రం' ఉండటం వలన ఆ దేవదేవుడికి పూజాభిషేకాలు నిర్వహించాలని చెప్పబడుతోంది. ఈ విధంగా చేయడం వలన సమస్తదోషాలు నశించి సకలశుభాలు చేకూరతాయని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News