ఈ రోజున ఉండ్రాళ్లను దానంగా ఇవ్వాలి
వినాయకుడు అందరికీ ఇష్టమైన దేవుడు ... అందరినీ అనుగ్రహించే దేవుడు. ఏ దేవుడిని ఆరాధించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించాలి. ఏ శుభకార్యం చేయాలన్నా ముందుగా ఆయనని ఆహ్వానించాలి. ఎలాంటి పనిమీద బయటికి వెళుతున్నా ముందుగా ఆయన ఆశీస్సులు అందుకోవాలి. అప్పుడే తలపెట్టిన కార్యక్రమాలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా సాఫీగా సాగిపోతూ ఉంటాయి.
శుభాన్ని కలిగించేది ... లాభాన్ని అందించేది వినాయకుడే కాబట్టి, ఎప్పుడు చూసినా వినాయకుడి ఆలయాలు భక్తుల సందడితో కళకళలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వినాయకుడు కొన్ని విశేషమైన రోజుల్లో ప్రత్యేక పూజలు అందుకుంటూ అనుగ్రహిస్తూ ఉంటాడు. అలాంటి విశేషమైన రోజుల్లో 'కార్తీక బహుళ చవితి' ఒకటిగా చెప్పబడుతోంది.
ఈ రోజున స్త్రీలు 'కరక చతుర్థీ వ్రతం' ఆచరిస్తూ ఉంటారు. స్త్రీలు తమ సౌభాగ్యం కలకాలం నిలిచి ఉండటం కోసం చేసే వ్రతాల్లో ఇది ఒకటిగా చెప్పబడుతోంది. ఈ రోజున శివపార్వతులతో వినాయకుడు ఉన్న చిత్రపటాన్ని పూలమాలికలతో అలంకరిస్తారు. ఈ వ్రత విధానం ప్రకారం వినాయకుడికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఆ స్వామికి ఇష్టమైన పిండివంటలను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు.
ఉదయం నుంచి చంద్రుడు కనిపించే వరకూ ఉపవాసం ఉండి ఆ తరువాత భోజనం చేస్తారు. ఇక ఆయనకి అత్యంత ప్రీతికరమైనవిగా చెప్పబడుతోన్న ఉండ్రాళ్లను దానంగా ఇస్తుంటారు. నియమనిష్టలను పాటిస్తూ ఈ రోజున వినాయకుడిని పూజించి ఉండ్రాళ్లను దానంగా ఇవ్వడం వలన ఆయురారోగ్యాలు కలగడమే కాకుండా స్త్రీలు కోరుకునే సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని చెప్పబడుతోంది.