ఈ రోజున గౌరీదేవిని పూజించాలి

సంతాన సౌభాగ్యాలు తమ జీవితానికి సార్ధకతగా స్త్రీలు భావిస్తుంటారు. అలాంటి సంతాన సౌభాగ్యాలను ప్రసాదించేది ... కాపాడేది గౌరీదేవి అని విశ్వసిస్తుంటారు. ఈ కారణంగానే వాళ్లు అనునిత్యం ఆ తల్లిని కొలుస్తుంటారు. ఆలయాలకి వెళ్లి అర్చనలు చేయిస్తుంటారు. ఇక పర్వదినాల్లో ఉపవాస దీక్షను చేపట్టి మరీ ఆ తల్లిని పూజిస్తారు.

ఇక నోములు ... వ్రతాల్లోను వాళ్ల ఆరాధనను అందుకునేది ... అనుగ్రహించేది కూడా ఆ అమ్మవారే. చల్లని మనసున్న ఆ తల్లిని కార్తీకమాసంలో పూజించడం వలన కలిగే ఫలితాలు అనంతాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 'కార్తీక బహుళ తదియ' రోజున గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. తదియ తిథికి అధిదేవత గౌరీదేవి కావడం వలన ఈ రోజున అమ్మవారిని అంకితభావంతో సేవించాలి.

ఈ రోజు ఉదయాన్నే స్నానం చేసి ... పూజా మందిరాన్ని అలంకరించి అమ్మవారిని పూజించాలి. ఆ తల్లి అనుగ్రహాన్ని కోరుతూ సేవించాలి. అమ్మవారికి ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత పండు - తాంబూలం ముత్తయిదువులకు వాయనంగా ఇవ్వాలి. అమ్మమనసుని ప్రేమ తప్ప మరేది గెలుచుకోలేదు. అనురాగభరితమైన పలకరింపును తప్ప ఆ మనసు మరేది ఆశించదు.

అమ్మలగన్నఅమ్మ మనసు అంతకన్నా సున్నితంగా కనిపిస్తుంది. ఆ తల్లి పూజను ఎంత ఘనంగా చేశారనే దానికంటే, ఎంత భక్తిశ్రద్ధలతో చేశారనే దానికే ఆమె ప్రాధాన్యతను ఇస్తుంది. అలా తనని ఆరాధించినవారికే ఆమె ఆయురారోగ్యాలను ... సిరి సంపదలను ... సంతాన సౌభాగ్యాలను అనుగ్రహిస్తుంది.


More Bhakti News