భక్తులను ముందుగానే హెచ్చరించే బాబా

శిరిడీ సాయిబాబా తనని విశ్వసించేవాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుండేవాడు. వాళ్లకు ఏదైనా ఆపద ఎదురుకానున్నా ... వాళ్లు ఇబ్బందుల్లో పడబోతున్నా ఆయనకి ముందుగానే తెలిసిపోతూ ఉండేది. దాంతో సాధ్యమైనంత వరకూ సూచన ప్రాయంగా వాళ్లకు జాగ్రత్తలు చెబుతూ అప్రమత్తం చేసేవాడు.

తమపట్ల గల ప్రేమతో ఆయన అలా చెబుతూనే ఉంటాడని ఎవరైనా కాస్త నిర్లక్ష్యంగా ఉంటే, కాస్తంత గట్టిగానే వాళ్లని హెచ్చరించేవాడు. ఇంతచేసినా కొంతమంది ఆయనపట్ల గల చనువు కారణంగా ఆ మాటలు వినిపించుకోకుండా ఇబ్బందుల్లో పడుతుండేవాళ్లు. బాబా తమని ఎందుకు వారించాడనే విషయం వాళ్లకి అప్పుడు అర్థమయ్యేది.

ఒకసారి ఒక భక్తుడు బాబా వారిస్తున్నా వినిపించుకోకుండా 'టాంగా'లో బయలుదేరి వెళ్లి ప్రమాదానికి గురవుతాడు. మరో భక్తుడు బాబా ఎంతగా చెబుతున్నా తప్పదంటూ బొంబాయి బయలుదేరి వెళ్లి మార్గమధ్యంలో తుఫానులో చిక్కుకుని నానాఇబ్బందులు పడతాడు. ఇంకో భక్తుడు తన కూతురికి సంబంధం కుదిరిందని బాబాతో చెబుతాడు. బాబా అయిష్టతను వ్యక్తం చేసినా గ్రహించకుండా ఆ పెళ్లి జరిపిస్తాడు. అయితే ఆదిలోనే ఆమె వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడుతుంది.

ఇక మరికొంత మంది భక్తులు బాబా సన్నిధిలో కొంతకాలం ఉందామని దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లు. వాళ్లలో కొందరిని వెంటనే వెళ్లిపొమ్మని బాబా పంపించేసేవాడు. బాబా అలా ఎందుకు చేశాడా అని ఆలోచిస్తూ వాళ్లు తమ ఊరు చేరుకునే వాళ్లు. అక్కడ తమవాళ్లు ఆపదలో ఉండటం చూసి అండగా నిలిచేవాళ్లు.

ఇలా బాబా తన భక్తులను పంపించడంలోను ... వారించడంలోను ఏదో ఒక అర్థం ఉండేది. అది ఏమిటనేది వాళ్లకి ఆ తరువాత తెలిసేది. ఇక బాబా మాటయే వేదవాక్కుగా భావించిన భక్తులు కూడా ఎంతోమంది ఉన్నారు. ఆయన చెప్పినట్టుగా నడచుకున్నవారి జీవితం సుఖశాంతులతో సాఫీగా సాగిపోతూ ఉండేది. ఇప్పటికీ బాబా తన భక్తులకు స్వప్నంలో కనిపిస్తూనే ఉంటాడనీ ... కొన్ని విషయాల్లో వాళ్లని ముందుగా హెచ్చరిస్తూ ఉంటాడని బాబా భక్తులు చెబుతుంటారు.


More Bhakti News