రంగులుమారే శివలింగం ఇక్కడ చూడొచ్చు !
కార్తీక మాసంలో తెల్లవారుఝామున శివశివా అంటూ చన్నీళ్లు స్నానం చేస్తూ ... హరహరా అంటూ ఆత్మ ప్రదక్షిణలు చేస్తే వచ్చే పుణ్యం అంతా ఇంతాకాదు. ఉపవాస దీక్షనుచేపట్టి పూజామందిరంలో దీపారాధన చేసి ... తులసికోటలో దీపం పెడుతుంటారు.
ఇక కార్తీక మాసంలో ఏదో ఒక రోజున తీరిక చేసుకుని ప్రసిద్ధిచెందిన క్షేత్రాలలో ఏదైనా ఒకటి చూసినా జన్మ తరిస్తుందని భావిస్తుంటారు. విశేషాలను ... విశిష్టతను సంతరించుకున్న క్షేత్రమైతే బాగుండునని అనుకుంటారు. అలా ఆలోచించేవారి దృష్టిని ముందుగా ఆకర్షించేది పంచారామ క్షేత్రాలే. అమరారామం .. ద్రాక్షారామం ... కుమారారామం .. సోమారామం .. క్షీరారామం 'పంచారామాలు'గా చెప్పబడుతున్నాయి.
ఈ అయిదు క్షేత్రాలు తమదైన ప్రత్యేకతను కలిగి విలసిల్లుతున్నాయి. ఈ ఐదింటిలో రంగులుమారే శివలింగం మనకి సోమారామంలో కనిపిస్తుంది. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని 'గునుపూడి' లో అలరారుతోంది. చంద్రుడిచే ప్రతిష్ఠించబడిన ఇక్కడి స్వామి 'సోమేశ్వరుడు'గా కొలవబడుతుండగా ... అమ్మవారు అన్నపూర్ణగా దర్శనమిస్తుంది.
చంద్రకళలు మారుతూ ఉంటాయి ... అలాగే చంద్రుడు ప్రతిష్ఠించిన ఇక్కడి శివలింగం కూడా రంగులు మారుతూ ఉంటుంది. అమావాస్య రోజుకి నల్లని వర్ణంలో కనిపించే ఈ శివలింగం క్రమేపి గోధుమ వర్ణాన్ని సంతరించుకుని పౌర్ణమినాటికి తెల్లని రంగులోకి మారిపోతుంది. అమావాస్య రోజున ఈ శివలింగం చూసినవాళ్లు తిరిగి పౌర్ణమి రోజున చూస్తే ఆశ్చర్యపోవలసిందే. ఇక్కడి పుష్కరిణి కూడా చంద్రుడి పేరుతోనే పిలవబడుతోంది.
ఇదే ప్రాంగణంలో లక్ష్మీదేవితో పాటు కొలువైన జనార్ధనస్వామి దర్శనమిస్తూ ఉంటాడు. అటు పురాణ నేపథ్యాన్నీ ... ఇటు చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న ఇది శివకేశవ క్షేత్రంగా ... మహిమాన్వితమైన క్షేత్రంగా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న ఈ క్షేత్రాన్ని కార్తీక మాసంలో ... ముఖ్యంగా పౌర్ణమి రోజున దర్శించుకోవడం వలన కలిగే ఫలితం విశేషంగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.