దైవాన్ని మెప్పించే దానగుణం !
కష్టాల్లో ఉన్నవాళ్లను ఆదుకోవడం ... ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయాన్ని అందించడం మానవత్వం. ఇతరులపట్ల దయాగుణాన్ని కలిగి ఉన్నప్పుడే భగవంతుడు మనపట్ల దయ చూపుతాడు. పదిమందికి సహాయపడే స్వభావం కలిగినవారికి ... వందమందికి సహాయపడగలిగే స్థోమతను భగవంతుడు ప్రసాదిస్తాడు.
మానవ సేవయే మాధవసేవగా భావించినవారికి ఆ స్వామి మోక్షాన్నే అందిస్తాడు. అందుకు ఉదాహరణగా తుకారామ్ గురించి చెప్పుకోవచ్చు. భార్యపోరు పడలేక తుకారం కొంతకాలం పాటు బట్టల వ్యాపారం చేస్తాడు. సాధారణంగా ఆయన ఇతరుల కంటే తక్కువ ధరకే బట్టలు అమ్ముతుంటాడు. దాంతో నష్టం వచ్చినా ఆ విషయాన్ని గురించి ఆయన పెద్దగా పట్టించుకోడు.
అలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఆయన బట్టల దుకాణంలో ఉండగా కొంతమంది వ్యక్తులు ఆయన దగ్గరికి వస్తారు. ఒక్కొక్కరూ ఒక్కో అవసరంలో ఉన్నట్టుగా చెబుతారు. బట్టలు కొనే స్తోమత తమకి లేదనీ .. అలాగని అవి లేకుండా తిరిగి వెళ్లలేని పరిస్థితి అని చెబుతారు. ఆయన దయా గుణం ... దానగుణం తమకి తెలుసనీ ... అందుకే వచ్చామని అంటారు.
తుకారామ్ దగ్గరున్న వస్త్రాలను అమ్మితేనే తిరిగి ఆ డబ్బుతో ఆయన దుకాణంలోకి వస్త్రాలను తీసుకురాగలడు. లేదంటే దుకాణాన్ని మూసుకోవలసి వస్తుంది. ఆ పాండురంగడే తనకి పరీక్ష పెట్టాడని భావించిన ఆయన, తన దుకాణంలోని బట్టలను దానంగా ఇచ్చేస్తాడు. ఈ దృశ్యాన్ని చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతారు. ఉన్నదంతా దానం చేయడం అమాయకత్వమని అనుకుంటారు.
ఎవరెలా అనుకున్నా చేతనైనసాయం చేయడమే తనకి తెలుసని అంటాడు తుకారామ్. తనలాంటి వారికి సాయం చేయడానికి ఆ భగవంతుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తాడు. తుకారాం విశ్వాసానికి తగినట్టుగానే ఆయన కుటుంబాన్ని ఆ పాండురంగడు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తాడు.