కార్తీక పౌర్ణమి రోజున దీపదాన ఫలితం !
ఆధ్యాత్మిక చింతనలో తరించేవారికీ ... పుణ్యరాశిని పెంచుకోవాలనుకునేవారికి ... ముక్తిమార్గంలో ప్రయాణించాలనుకునేవారికి భగవంతుడు ప్రసాదించిన వరమే 'కార్తీక మాసం'. కార్తీక మాసంలో విష్ణు సహస్రనామం ... శివ సహస్రనామం ... లలితా సహస్రనామ పారాయణం చేయడం విశేషమైన పుణ్యఫలితాలను ఇస్తుంది.
ఈ మాసంలో విష్ణుపురాణం ... శివపురాణం దానం చేయడం వలన కలిగే ఫలితం మాటల్లో చెప్పలేనిది. ఇక 'పౌర్ణమి' రోజున చేయబడే పూజలు ... నోములు ... వ్రతాలు ... దానాలు మరింత విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఈ రోజున చేసే 'దీపదానం' విశిష్టత ఆధ్యాత్మిక గ్రంధాల్లో కనిపిస్తుంది. బంగారపు ప్రమిదలో గానీ ... వెండి ప్రమిదలో గాని ... రాగి ప్రమిదలో గాని ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి బ్రాహ్మణుడికి దానం చేయాలని చెప్పబడుతోంది.
అంత స్తోమత లేనివాళ్లు వరి పిండితో గానీ ... గోధుమపిండితో గాని చేసిన ప్రమిదలో ఆవునెయ్యితో దీపాన్ని వెలిగించి దానం చేయవచ్చు. ఇలా ఈ దీపదాన కార్యక్రమాన్ని వీలునుబట్టి నదీతీరంలో గానీ ... ఆలయంలో గాని జరుపుతుంటారు. కార్తీక పౌర్ణమి రోజున చేసే దీపదానం వలన అనేక దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. దీపదానం అందించే పుణ్యఫలితం సకల శుభాలను చేకూరుస్తుందని స్పష్టం చేయబడుతోంది.