కార్తీక పౌర్ణమి రోజున దేవతార్చన ఫలితం !

కార్తీక మాసానికి సమానమైన మాసం ... గంగకి సమానమైన తీర్థంలేదని అంటారు. శివకేశవుల అనుగ్రహాన్ని పొందడానికి ఇంతకుమించిన అవకాశం మరొకటి లేదని అంటారు. అందువల్లనే ఈ మాసంలో నదీస్నానం చేసి శివకేశవులను ఆరాధిస్తూ ఉంటారు.

సూర్యోదయానికి ముందుగానే చన్నీటితో స్నానం చేసి దీపారాధన చేయడం ... అలాగే సాయంత్రం వేళ సూర్యాస్తమయం కాగానే దీపారాధన చేయడం ఒక నియమంగా చెప్పబడుతోంది. ఈ మాసంలో ఉపవాస దీక్షను చేపట్టి తులసిచెట్టు చుట్టూ ... ఉసిరిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం వలన అనేక దోషాలు నశిస్తాయని స్పష్టం చేయబడుతోంది.

ఈ నేపథ్యంలో కార్తీక పౌర్ణమి మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. పరమపవిత్రమైనటువంటి ఈ రోజున వైష్ణవ ఆలయాలను దర్శించుకున్నవాళ్లు అక్కడి స్వామివారికి 'లక్ష తులసిపూజ' చేయిస్తుంటారు. అలాగే శివాలయాలను దర్శించుకున్నవాళ్లు అక్కడి స్వామివారికి 'లక్ష బిల్వార్చన' జరిపిస్తుంటారు.

ఇక అమ్మవారి ఆరాధన కూడా ఈ మాసంలో ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుంది కాబట్టి, లక్ష పుష్పార్చన ... లక్ష కుంకుమార్చన కూడా చేయిస్తుంటారు. ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజున విష్ణుమూర్తినీ ... శివుడినీ ... శక్తిని లక్ష్య సంఖ్యలో అర్చించడం వలన, ఆయురారోగ్యాలు ... అష్టైశ్వర్యాలు ... సంతాన సౌభాగ్యవృద్ధి కలుగుతాయని చెప్పబడుతోంది.


More Bhakti News