కార్తీక పౌర్ణమిన ఇక్కడ స్నానంచేస్తే చాలు
ఏదైనా క్షేత్రానికి వెళితే ముందుగా అక్కడి తీర్థంలో స్నానం చేసి, ఆ తరువాత దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు. పుణ్యతీర్థాలలో స్నానం చేయడం వలన శరీరంతో పాటు మనసు కూడా పవిత్రమై, భగవంతుడి సన్నిధానంలో అడుగుపెట్టే అర్హత లభిస్తుంది. అందువలన ముందుగా పుణ్యతీర్థాలకు నమస్కరించి వాటిలో స్నానం చేస్తుంటారు.
అలాంటి పుణ్యతీర్థాలలో ఒకటిగా వేములవాడ క్షేత్రంలోని 'ధర్మకుండం' దర్శనమిస్తుంది. కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. సాధారణంగా దైవం ఆవిర్భవించిన తరువాత ఆ దైవ సంకల్పంతో తీర్థం ఏర్పడుతూ ఉంటుంది. అలా కాకుండా ఇక్కడి రాజరాజేశ్వరుడు ధర్మకుండంలో నుంచే వెలువడటం విశేషం. అదే ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకతగా ... విశిష్టతగా కూడా చెప్పబడుతోంది.
ఇక్కడి ధర్మకుండంలో స్నానం చేయడం వలన సమస్త పాపాలు నశించి విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి. సాక్షాత్తు సూర్యభగవానుడు సైతం తన మనోభీష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం ఈ ధర్మకుండంలో స్నానం చేసినట్టు స్థలపురాణం చెబుతోంది. ఎంతోమంది దేవతలు ... మహర్షులు ఈ ధర్మకుండంలో స్నానం చేసి స్వామివారిని దర్శించి కోరిన వరాలను పొందినట్టు చెప్పబడుతోంది.
అలాంటి ఈ ధర్మకుండంలో కార్తీకమాసంలో స్నానం చేయడం వలన ధర్మబద్ధమైన కోరికలు నెరవేరడమే కాకుండా, అనంతమైన పుణ్యఫలాలు దక్కుతాయని అంటారు. అందువలన కార్తీక మాసంలో ... ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ఈ క్షేత్రాన్ని వేల సంఖ్యలో భక్తులు దర్శిస్తుంటారు. ధర్మకుండంలో స్నానం చేసి ... ఉసిరిక దీపాలు వెలిగించి ... రాజరాజేశ్వరుడి దర్శనం చేసుకుని ధన్యులవుతుంటారు.