కార్తీక పౌర్ణమిన దీపారాధన ఫలితం !

జీవనాన్ని కొనసాగించడానికి ఎవరికి వాళ్లు ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటూ ఉండాలి. ఇందుకు సంబంధించిన పనుల్లో ఎవరికి వాళ్లు తీరిక లేకుండా ఉంటారు. ఉదయాన్నే నిద్రలేచి ... తలస్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి ... పూజామందిరం దగ్గర ప్రశాంతంగా కూర్చుని దీపారాధన చేసి శివకేశవులను ఆరాధించడానికి అందరికీ అవకాశం ఉండకపోవచ్చు.

విశేషమైనటు వంటి పర్వదినాల్లో దైవానికి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలని ఉన్నా అందుకు పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. అలాంటి పుణ్యతిథుల్లో దీపారాధన కూడా చేయలేకపోయినందుకు చాలామంది బాధపడుతుంటారు. అలాంటివారికి ఆ పుణ్యఫలితాన్ని అందించడానికి భగవంతుడు కల్పించిన అవకాశమే 'కార్తీకపౌర్ణమి'.

ఈ రోజున స్నాన .. దాన .. జపతపాలు ఏది చేసినా అది అక్షయమై ఆ పుణ్యఫలితం జన్మజన్మల పాటు వెంటవస్తుంది. అలాంటి ఈ రోజున దగ్గరలో గల ఆలయానికి వెళ్లి 365 వత్తులతో దీపారాధన చేస్తుంటారు. కుటుంబసభ్యుల్లో ఒక్కొక్కరి పేరున 365 వత్తులను సిద్ధం చేసుకుని వెలిగిస్తుంటారు. ఆలయంలో గల తులసిచెట్టు దగ్గర గానీ ... రావిచెట్టు దగ్గర గాని ... ఉసిరిచెట్టు దగ్గర గాని .. ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ప్రదేశంలో గాని దీపారాధన చేస్తుంటారు.

ఈ రోజున దీపాలను ఆవునెయ్యితో మాత్రమే వెలిగించాలనే నియమం ఉంది. 365 వత్తులతో దీపారాధన చేయడం వలన ఏడాది పొడవునా దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. పర్వదినాల్లో దీపారాధన చేయని దోషం తొలగిపోతుంది. కార్తీక పౌర్ణమి రోజున ఉపవాస దీక్షను చేపట్టి భక్తి శ్రద్ధలతో ఆవునెయ్యితో దీపారాధన చేయడం వలన సమస్త దోషాలు నశించి సకల శుభాలు కలుగుతాయని చెప్పబడుతోంది.


More Bhakti News