కార్తీక పౌర్ణమి రోజున దర్శించవలసిన క్షేత్రం
కార్తీకమాసంలో శ్రీమహావిష్ణువును పూజించినా ... సదాశివుడిని సేవించినా అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని చెప్పబడుతోంది. ముఖ్యంగా కార్తీకపౌర్ణమి రోజున నదీతీరంలో గల హరిహరుల క్షేత్రాన్ని దర్శించడం వలన మనోభీష్టాలు నెరవేరడమే కాకుండా, మోక్షం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
అలా నదీ సంగమ స్థానానికి చేరువలో అలరారుతోన్న హరిహరుల క్షేత్రం మనకి 'వాడపల్లి'లో కనిపిస్తుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడాకి దగ్గరలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. కృష్ణా ... మూసీనదీ సంగమస్థానం గల ఈ క్షేత్రం పవిత్రతకు ... ప్రశాంతతకు నిలయంగా కనిపిస్తూ ఉంటుంది. ఒకవైపున లక్ష్మీనరసింహస్వామి ఆలయం ... మరోవైపున మీనాక్షీ అగస్త్యేశ్వరస్వామి ఆలయం దర్శనమిస్తూ ఉంటాయి.
లక్ష్మీ నరసింహస్వామి నాశికకు ఎదురుగా గల దీపారాధన రెపరెపలాడుతూ ఉండటం వలన స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడని విశ్వసిస్తుంటారు. అలాగే ఒక మూగజీవిని వేటగాడి బారినుంచి ఇక్కడి శివుడు కాపాడటం వలన ... ఆయన శిరస్సు భాగం నుంచి అదే పనిగా నీరు ధారగా వస్తూ ఉండటం వలన శివయ్య కూడా ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడని భావిస్తుంటారు.
ఇన్ని విశేషాలు గల ఈ క్షేత్రానికి కార్తీక పౌర్ణమి రోజున వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. నదీ సంగమస్థానంలో స్నానం చేసి ... శివకేశవులను దర్శించుకుంటారు. ఉసిరిక దీపాలు వెలిగించి ... వనభోజనాలు చేసి వెళుతుంటారు. నదీతీరంలో కొలువైన శివకేశవులను కార్తీక పౌర్ణమి రోజున దర్శించాలనుకునే భక్తులకు ఈ క్షేత్రం అన్ని విధాలా అనుకూలమైనది. పరమపవిత్రమైన ఈ క్షేత్ర దర్శనం మానసికపరమైన ఆనందాన్నీ ... ఆధ్యాత్మికపరమైన అనుభూతిని అందించడమే కాదు, అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.