శనిదేవుడు ఇలా కరుణిస్తాడట !
అనేక అవసరాలతో జీవితం కొనసాగుతూ ఉంటుంది. వాటిలో కొన్ని నిత్యవసరాలు ... మరికొన్ని అత్యవసరాలు ఉంటాయి. వీటిని తీర్చుకోవడానికి ఎవరి స్థాయిలో వాళ్లు కష్టపడవలసిందే. ఈ నేపథ్యంలో అసలు పనంటూ దొరికితే చాలు .... ఎంత ఇచ్చినా ఫరవాలేదని అనుకునే వాళ్లే ఎక్కువగా కనిపిస్తుంటారు.
ఏ రోజు గురించి ఆ రోజే ఆలోచించే వాళ్ల పరిస్థితిని చాలామంది తమకి అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. ఒక పనికి ఎక్కువమంది అవసరమైనా ... తక్కువమందిని తక్కువకి మాట్లాడి, ఉదయం నుంచి సాయంత్రం వరకూ వాళ్లతో పనిచేయిస్తారు. వాళ్లకి ఇచ్చినదే చాలా ఎక్కువ అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. ఇక పనివాళ్లు ఆ రోజు గడిచిందనే ఆలోచనతోనే అలసటను కూడా మరిచిపోయి ఇంటికి చేరుతుంటారు.
పని ఏదైనా అది చేసిన వాళ్లకు సంతోషాన్ని కలిగించేలా ఫలితాన్ని ఇవ్వాలనే మాట శిరిడీ సాయిబాబా తరచూ చెబుతూ ఉండేవాడట. తను చెప్పిన పని చేసినవారికి ఆయన కాస్త ఎక్కువ పైకమే ఇచ్చేవాడు. పనికి తగిన పైకం ఇవ్వకపోతే వాళ్ల సేవ రుణంగా మిగిలిపోతుందని చెప్పేవాడు. ఇక ఆధ్యాత్మిక గ్రంధాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
కష్టాన్ని గుర్తించి పనికి తగిన పైకం ఇవ్వడం మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. అలా మానవత్వాన్ని కలిగినవాళ్లని శనిదేవుడు సైతం తన వలన ఇబ్బంది పడకుండా చూసుకుంటాడట. అందువలన శనిగ్రహ సంబంధమైన దోషంతో బాధలుపడుతోన్నవాళ్లు, ఇతరుల కష్టాన్ని గుర్తించి వాళ్ల శ్రమకి తగిన ప్రతిఫలం అందజేస్తూ ఉండాలి. అందువలన శనిదేవుడు శాంతిస్తాడనీ, ఫలితంగా ఆయన ప్రభావం యొక్క తీవ్రత తగ్గుతుందని స్పష్టం చేయబడుతోంది.
సహృదయంతో ఇతరుల కష్టాన్ని అర్థం చేసుకుని పెద్ద మనసుతో వ్యవహరించేవారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా భగవంతుడే చూస్తుంటాడు. శ్రమను గుర్తించి ఇచ్చినది భగవంతుడి అనుగ్రహ రూపంలో తిరిగి చేరుతుందనే విషయాన్ని ఎప్పటికీ మరిచిపోకూడదు.