అందరినీ ఆదుకునేది ఆంజనేయుడే !

హనుమంతుడు శివాంశ సంభూతుడు ... విష్ణు స్వరూపుడైన రాముడికి పరమ భక్తుడు. అందువలన శివకేశవులను ఆరాధించే వాళ్లందరూ ఆయనకి ప్రీతిపాత్రులే. శివకేశవులకి ఇష్టమైన కార్తీకమాసంలో హనుమంతుడు మరింత త్వరగా అనుగ్రహిస్తాడని అంటారు. ఈ కారణంగానే ఈ మాసంలో హనుమంతుడి దీక్షను స్వీకరించే వాళ్లు అధికంగా ఉంటారు.

సాధారణంగా సీతారాముల ఆలయాల్లో స్వామివారిని సేవిస్తూ కనిపించే హనుమంతుడు, కొన్ని ప్రాంతాల్లో ప్రధాన దైవంగా దర్శనమిస్తూ ఉంటాడు. అలా ఆ స్వామి కొలువుదీరిన ఆలయం మనకి 'రాళ్లవాగుతండ' లో కనిపిస్తుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఈ ఆలయం దర్శనమిస్తుంది. ఇక్కడి హనుమంతుడు ప్రాచీనకాలం నుంచి పూజలు అందుకుంటూ ఉన్నాడని అంటారు.

ఊళ్లోవాళ్లంతా తరతరాలుగా ఆ స్వామిని ఇలవేల్పుగా భావిస్తూ ఆరాధిస్తూ వస్తున్నారు. తమ పాడిపంటలను ఆ స్వామి రక్షిస్తూ ఉంటాడని విశ్వసిస్తుంటారు. గ్రహసంబంధమైన దోషాల నుంచి ... దుష్టశక్తుల నుంచి తమని కాపాడేది ఆయనేనని చెబుతుంటారు. ఈ కారణంగా అందరూ ఆ స్వామిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. నియమనిష్టలను పాటిస్తూ సేవలు నిర్వహిస్తుంటారు.

స్వామి ఈ గ్రామాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడనడానికి నిదర్శనంగా, ఆలయ ప్రాంగణంలో భారీ హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చాలాదూరం నుంచే ఈ హనుమంతుడు కనిపిస్తుంటాడు. ఈ విగ్రహం కారణంగా కూడా ఇక్కడ హనుమంతుడి ఆలయం ఉన్నట్టుగా కొత్తవారికి తెలుస్తూ ఉంటుంది. వాళ్లు దర్శించుకోవడానికి అవకాశం కలుగుతుంటుంది.


More Bhakti News