అయ్యప్పస్వామి పెట్టిన నియమం !

అసుర సేనలు వెంటరాగా దేవలోకంపై 'మహిషి' విరుచుకుపడుతుంది. దేవతల అభ్యర్థన మేరకు మణికంఠుడు రంగంలోకి దిగుతాడు. ఒక్క మణికంఠుడు తనని ఏం చేయగలడనే నిర్లక్ష్యంతో ఆయనవైపు మహిషి దూసుకు వస్తుంది. మణికంఠుడి శక్తి సామర్థ్యాల ముందు నిలువలేక మహిషి కుప్పకూలిపోతుంది.

అలా మణికంఠుడి చేతిలో అంతం కాబడిన మహిషి, అందరూ చూస్తుండగానే సౌందర్యవతి అయిన ఒక యువతిగా మారిపోతుంది. ఆయన పాదధూళి సోకిన కారణంగా శాపవిమోచనమై అందమైన రూపం లభించినదంటూ కృతజ్ఞతలు తెలియజేస్తుంది. తనని వివాహం చేసుకోవలసిందిగా కోరుతుంది.

శబరి గిరిపై వెలసిన తనని దర్శించుకోవడానికి ఏ సంవత్సరమైతే ఒక్క కన్నెస్వామి కూడా రాకుండా ఉంటాడో, ఆ సంవత్సరం ఆమెను వివాహమాడతానని మణికంఠుడు మాట ఇస్తాడు. అప్పటి వరకూ 'మాళిగైపురత్తమ్మ' పేరుతో పూజలు అందుకుంటూ ఉండమని వరాన్ని ప్రసాదిస్తాడు.

ఈ కారణంగా ప్రతి సంవత్సరం ఇక్కడికి కన్నెస్వాములు రాకుండా ఉండాలనే ఆమె కోరుకుంటూ ఉంటుంది. కన్నెస్వాములు వచ్చారో లేదోననే విషయాన్ని తెలుసుకుంటూనే ఉంటుంది. కన్నెస్వాములు వచ్చినట్టు తెలియగానే, ఇక ఆ సంవత్సరం తన కోరిక నెరవేరనందున నిరాశా నిస్పృహలకి లోనవుతుందని అంటారు.


More Bhakti News