రత్నాలతో చేసిన నారాయణుడి పూజ !
విష్ణుచిత్తుడు నిరంతరం శ్రీమహావిష్ణువు నామాన్ని స్మరిస్తూ ... వివిధ రకాల పుష్పాలతో చేయబడిన మాలికలతో ఆ స్వామిని అలంకరిస్తూ ఉండేవాడు. ఆ స్వామి సమ్మోహన రూపాన్ని కనులారా దర్శిస్తూ తనని తాను మరిచిపోతూ ఉండేవాడు. అలాంటి విష్ణుచిత్తుడు ఒకసారి శ్రీమహావిష్ణువు ఆదేశంతో పాండ్యరాజైనటువంటి వల్లభదేవుడిని కలుసుకుంటాడు. ఆయనకి విష్ణుభగవానుడి యొక్క తత్త్వాన్నివివరిస్తాడు.
తన అజ్ఞానాన్ని తొలగించి, శ్రీమహావిష్ణువు పాదాలను ఆశ్రయించేలా చేసిన విష్ణుచిత్తుడికి వల్లభదేవుడు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. విష్ణుచిత్తుడు వారిస్తున్నా వినిపించుకోకుండా పెద్దమొత్తంలో రత్నాలను బహుకరించి ... ఏనుగుపై ఊరేగిస్తూ ఆయనని ఇంటిదగ్గర దిగబెట్టమని తన పరివారాన్ని ఆదేశిస్తాడు.
అలా విష్ణుచిత్తుడు ఏనుగుపై ఊరేగుతూ వస్తూ ఉండగా, గరుడవాహనంపై వచ్చిన శ్రీమహావిష్ణువు ఆయనకి సాక్షాత్కరిస్తాడు. మనోహరమైన స్వామి రూపాన్ని చూసిన విష్ణుచిత్తుడు ఆనందంతో పొంగిపోతాడు. స్వామివారి పాదాలను పుష్పాలతో పూజించాలని ఆరాటపడతాడు. తాను ఉన్నది ఏనుగుపైన ... రాజుగారు ఇచ్చిన రత్నాలు మాత్రమే దగ్గర ఉన్నాయి. ఆలస్యం చేస్తే మళ్లీ అలాంటి అవకాశం రాదనే ఉద్దేశంతో స్వామిని ఆ రత్నాలతోనే పూజిస్తాడు.
స్వామివారి పాదాలకు గట్టిగా తగలకూడదనే ఉద్దేశంతో రత్నాలతో సున్నితంగా తన పూజను పూర్తి చేస్తాడు. విష్ణుచిత్తుడి భక్తికి మెచ్చిన శ్రీమహావిష్ణువు ... ఇకపై 'పెరియాళ్వార్' గా ప్రసిద్ధి చెందుతావంటూ వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ రోజు నుంచి విష్ణుచిత్తుడు ... పెరియాళ్వార్ గా పిలవబడుతున్నాడు. స్వామివారి సన్నిధానంలో ప్రత్యేక స్థానాన్నిఅలంకరించి కొలవబడుతున్నాడు.