శిరిడీసాయి చూపిన మహిమ అలాంటిది !
శిరిడీలో అడుగుపెట్టిన బాబాను ఓ సాధారణ ఫకీరుగానే అందరూ భావించారు. అలాంటి వాళ్లందరి మనసులను తన మందిరంగా చేసుకోవడానికి ఆయనకి ఎంతోకాలం పట్టలేదు. ఇందుకోసం ఆయన ఎలాంటి మంత్రతంత్రాలను ప్రదర్శించలేదు. తనపట్ల విశ్వాసంతో వచ్చినవారికి విభూతితో పాటు ఆయన ఆకాశమంతటి ప్రేమను పంచాడు.
భక్తుల కష్టనష్టాలను తనవిగా స్వీకరించి, వాళ్లకి సంతోషాలను ప్రసాదించాడు. అందరూ సమైక్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఉత్సవాలకు ప్రాధాన్యతను ఇచ్చేవాడు. అలా ఒకసారి బాబా భక్తులు శ్రీరామనవమి ఉత్సవాలు జరుకోవాలనే ఉద్దేశంతో ఆయనను సంప్రదిస్తారు. అందుకు ఆయన ఆనందంగా అంగీకారాన్ని తెలపడంతో వాళ్లు సంతోషంతో పొంగిపోతారు.
అయితే ఉత్సవాలకి వచ్చే జనానికి మంచినీళ్ల సమస్య ఏర్పడవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. ఆ గ్రామంలోని వాళ్లంతా ఒక బావి నుంచే మంచినీరు తెచ్చుకుంటున్నారనీ, ఇంకో బావిలో చాలా నీళ్లు ఉన్నప్పటికీ అవి ఉప్పగా ఉంటాయని అంటారు. ఉప్పునీటి బావి కనుక మంచినీటి బావి అయ్యుంటే ఈ పరిస్థితి ఉండేదికాదని అంటారు. ఆ విషయాన్ని గురించి అంతగా ఆలోచించవద్దనీ, ఉత్సవాలకి ఏర్పాట్లు చేయమని చెబుతాడు బాబా.
ఆ తరువాత బాబా ఆ ఉప్పునీటి బావి దగ్గరికి వాళ్లతో కలిసి వెళతాడు. మంచినీటి బావి నుంచి ఒక చెంబుతో నీళ్లు తెప్పించి, అందులో కొన్ని పూలు వేసి ఆ జలాన్ని ఉప్పునీటి బావిలో పోస్తాడు. ఇక ఆ బావిలోని నీళ్లు కూడా తాగడానికి ఉపయోగించవచ్చని అంటాడు. అందులోని నీళ్లు తోడి వాళ్ల దోసిట్లో పోస్తాడు. ఆ నీళ్లు తాగిన వాళ్లంతా అవి ఎంతో రుచిగా ఉండటంతో ఆనందాశ్చర్యాలకి లోనవుతారు.
అలా ఆ ఉత్సవాలకి మంచినీటి సమస్యలేకుండా బాబా చూస్తాడు. ఇక ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బోర్ వేయించిన వాళ్లు ఉప్పునీరుపడితే, బాబా ప్రతిమకి అభిషేకం చేసి ఆ నీటిని బోరు గొట్టంలో పోస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన ఉప్పునీరు .. మంచినీరుగా మారిన సందర్భాలు ఎన్నో కనిపిస్తాయి.