లింగగిరి శివుడి లీలా విశేషం !
కార్తీకమాసంలో శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకి కాస్త దూరంగా ... గుట్టలపై గల శివాలయాలకి భక్తులు ఎక్కువగా వెళుతుంటారు. అలాంటి ప్రదేశాలకి వెళ్లడం వలన మనసుకి ప్రశాంతత లభిస్తుంది. అక్కడ వనభోజనాలు చేయడం వలన వివిధ దోషాలు తొలగిపోతాయి.
అలా భక్తులు కార్తీకమాసంలో ఎక్కువగా దర్శించుకునే క్షేత్రాల్లో 'లింగగిరి' ఒకటిగా కనిపిస్తుంది. ఇక్కడి శివుడు గుట్టపై కొలువుదీరిన కారణంగా ఈ గ్రామానికి ఈ పేరు వచ్చిందని చెబుతుంటారు. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ మండలం పరిధిలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. ఇక్కడి స్వామి దర్శనమాత్రం చేతనే దారిద్ర్యాన్నీ ... దుఃఖాన్ని తొలగిస్తాడని భక్తులు విశ్వసిస్తుంటారు.
ప్రాచీనకాలానికి చెందిన ఈ క్షేత్రంలో స్వామి సంకల్పం మేరకు ఏర్పడిన 'కోనేరు' ఎంతో విశిష్టమైనదని చెబుతుంటారు. ఎలాంటి కరవు పరిస్థితుల్లోను ఈ కోనేరు ఎండిపోవడం జరగలేదని అంటారు. స్పర్శమాత్రం చేతనే పాపాలను కడిగేసే ఈ కోనేరు స్వామివారి లీలావిశేషాల్లో ఒక భాగమని విశ్వసిస్తుంటారు. అందువలన ఇది మహిమాన్వితమైనదనీ ... దీనిలోని నీళ్లు తలపై చల్లుకోవడం వలన సమస్త పాపాల నుంచి విముక్తి లభిస్తుందని అంటారు.
ప్రాచీన వైభవానికి ప్రతీకగా ... మహాదేవుడి మహిమలకు నిదర్శనంగా నిలుస్తోన్న ఈ క్షేత్రానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా కార్తీకమాసంలో పెద్దసంఖ్యలో వచ్చే భక్తులు ఇక్కడ స్వామికి అభిషేకాలు ... అర్చనలు జరిపిస్తారు. ఉసిరిక దీపాలు వెలిగిస్తారు ... వన భోజనాలు చేసి వెళతారు.
ఇక్కడి స్వామిని అంకితభావంతో సేవించేవారికి అనంతమైన పుణ్యఫలాలు దక్కుతాయని అంటారు. ఆ స్వామి అనుగ్రహంతో సుఖశాంతులు వరంగా లభిస్తాయని చెబుతుంటారు. స్వామివారు చూపిన అనేక మహిమలు మనకి ఇక్కడ భక్తుల అనుభవాలుగా వినిపిస్తూ ఉంటాయి. అనిర్వచనీయమైన ఆనందానుభూతులను అందిస్తూ ఉంటాయి.