అనుగ్రహించేవాడే ఆదిదేవుడు
పరమశివుడి లీలావిశేషాలు ఇన్నీఅన్నీ కావు. తన భక్తులను తల్లిలా ఆదరించడం ... తండ్రిలా సున్నితంగా మందలిస్తూ దారిలో పెట్టడం పరమశివుడిలోని ప్రత్యేకతగా కనిపిస్తుంది. తన భక్తుల ఆకలి తీర్చాలి ... ఆపదల నుంచి వాళ్లని ఆదుకోవాలి ... వాళ్లకి కావలసినవి అనుగ్రహించాలని ఆదిదేవుడు ఆరాటపడుతుంటాడు.
భక్తులకి కొన్ని పరీక్షలు పెట్టి అందులో వాళ్లు గెలిచినప్పుడు సదాశివుడు సంతోషంతో మురిసిపోతుంటాడు. తనపై గల భక్తి ఎక్కువగా ఉందా ... కన్నకొడుకు పట్ల ప్రేమ ఎక్కువగా ఉందా ? అని చిరుతొండనంబిని పరీక్షిస్తాడు శివుడు. అలాగే అతని కొడుకైన శిరియాళుడికి ప్రాణాలపై తీపి ఎక్కువగా ఉందా ... తన కోసం వాటిని తృణప్రాయంగా వదులుకునే భక్తి ఉందా ? అనే విషయాన్ని పరీక్షించి ఆనందంతో పొంగిపోతాడు.
అలాగే తక్కువ ఆయుష్షుని ఇచ్చినా ఆ సమయాన్నంతటిని తన ఆరాధనకే కేటాయించిన మార్కండేయుడిని చిరంజీవిగా అనుగ్రహిస్తాడు. యమపాశం బారి నుంచి మార్కండేయుడిని రక్షించడమే కాదు, తన భక్తురాలిని కన్నతండ్రి కోపించినా సహించనివాడిగా సదాశివుడు కనిపిస్తాడు. తనని సేవిస్తోన బాలభక్తురాలు 'గొడగూచి'పై ఆమె తండ్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేయబోతే, వెంటనే అక్కడ ప్రత్యక్షమై ఆ పిల్లను అక్కున చేర్చుకున్నతీరు మహాదేవుడి మంచులాంటి మనసుకు అద్దంపడుతుంది.
ఇక తన భక్తుడైన ఒక పేద బ్రాహ్మణుడి ఆకలి తీర్చడం కోసం మరోభక్తుడైన నత్కీరుడితో వాదనకి దిగిన శివుడు అతని అహంభావాన్ని తొలగిస్తాడు. ఇక తొలినాళ్లలో కన్నప్ప ... మంజునాథుడు బతకడానికి భగవంతుడి ప్రమేయం అవసరం లేదని అనుకుంటారు. అలాంటి వాళ్లకు భక్తి కలిగిన యువతులను జోడీగా చేయడమే కాకుండా, తన లీలా విశేషాల ద్వారా వాళ్లని మహాభక్తుల జాబితాలో చేర్చాడు. ఇలా ఆ దేవదేవుడు అసమానమైన భక్తికి వయసుతోగానీ ... పాండిత్యంతో గాని పనిలేదనే విషయాన్ని నిరూపించాడు. ఆ దారిలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని అనుగ్రహించాడు.