కార్తీకంలో ఉమామల్లేశ్వరుడి దర్శన ఫలితం !
కార్తీకమాసపు సోమవారం పరమశివుడికి పరమ ప్రీతికరమైన రోజు. విశేషమైనటు వంటి ఈ రోజున ఆ స్వామి దర్శనం అనంతమైన పుణ్యఫలాలను అందిస్తుంది. ఆ స్వామివారు అమ్మవారి సమేతుడై ఆవిర్భవించిన క్షేత్రాన్ని దర్శించినా, శ్రీ మహావిష్ణువుతో పాటు కొలువుదీరిన క్షేత్రాన్ని దర్శించినా లభించే పుణ్యఫలితం మాటల్లో చెప్పలేనిది.
ఆ దేవదేవుడు అమ్మవారి సమేతంగా ఆవిర్భవించి ... శ్రీమహావిష్ణువుతో పాటు భక్తులను అనుగ్రహించే క్షేత్రాలు అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి అరుదైన క్షేత్రంగా 'జొన్నాడ' దర్శనమిస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం సమీపంలో ఈ క్షేత్రం అలరారుతోంది. ఇక్కడి శివుడిని అగస్త్యేశ్వరుడు ... జనార్ధనస్వామిని నారదుడు ప్రతిష్ఠించినట్టు స్థలపురాణం చెబుతోంది.
ఇక్కడి సదాశివుడు ఉమామల్లేశ్వరస్వామిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. గోదావరీ నదీ తీరంలో గల ఉమాసమేతుడైన పరమేశ్వరుడుని కార్తీకమాసంలో పూజించడం వలన మోక్షం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన కార్తీకమాసంలో ఈ క్షేత్రాన్ని దర్శించుకునే భ్యక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కార్తీక సోమవారాల్లోను ... పౌర్ణమి రోజున ఈ క్షేత్రంలో భక్తుల సందడి మరింత అధికంగా ఉంటుంది.
గోదావరి నదిలో స్నానం చేసిన భక్తులు స్వామివారి అభిషేక మహోత్సవంలో ... బిల్వదళార్చనలో పాల్గొని తరిస్తారు. ఈ క్షేత్రంలో అడుగుపెట్టడంతోనే సమస్త పాపాలు నశిస్తాయి ... సకల శుభాలు చేకూరతాయి. భక్తులకు మోక్షాన్ని ప్రసాదించవలసిందిగా అగస్త్యేశ్వరుడు స్వామిని ప్రార్ధించడం వలన, ఉమామల్లేశ్వరుడి దర్శనం మోక్షాన్ని కలిగిస్తుందని చెప్పబడుతోంది.