అదే ఇక్కడి హనుమంతుడి విశేషం !

సీతారాముల సేవలో తరించిన హనుమంతుడు అందరి హృదయాల్లోనూ శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. తన రాముడిని కొలిచినా ... తనని పిలిచినా క్షణాల్లో భక్తులచెంత నిలుస్తాడు. ఆపదల్లో నుంచి గట్టెక్కిస్తూ అడిగిన వరాలను అనుగ్రహిస్తుంటాడు.

ఈ కారణంగానే హనుమంతుడి ఆలయాలు ... మందిరాలు చాలా గ్రామాల్లో కనిపిస్తూ ఉంటాయి. రాముడిని తన ప్రభువుగా భావించి ఆయనకి సేవలు చేయడమే కాదు, తన భక్తులకు కూడా సేవలు చేసినవాడిగా హనుమంతుడు కనిపిస్తాడు. అలా ఆయన తన భక్తుడికి చేసిన సేవకి నిదర్శనంగా నిలిచిన క్షేత్రంగా 'గురవాయి గూడెం' కనిపిస్తుంది.

జంగారెడ్డిగూడెం మండలం ... పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. అనునిత్యం హనుమ నామస్మరణతో గడిపిన 'మధ్వ మహర్షి'కి శరీరం సహకరించని పరిస్థితుల్లో, హనుమంతుడు ఆయనకి వివిధరకాల ఫలాలు తెచ్చిపెడుతూ సేవలు చేశాడట. సాక్షాత్తు హనుమంతుడితో సేవలు చేయించుకుంటున్నందుకు ఆ మహర్షి బాధపడతాడు. ఆయన దర్శనభాగ్యం తనకి శాశ్వతంగా కలగాలని కోరుకుంటాడు.

దాంతో ఆయన మద్దిచెట్టు రూపంలోనూ ... తాను శిలా రూపంలోనూ అక్కడ కొలువుదీరి పూజలు అందుకుంటామంటూ హనుమంతుడు వరాన్ని ప్రసాదిస్తాడు. ఈ కారణంగానే ఇక్కడి స్వామివారు మద్ది ఆంజనేయుడుగా పిలవబడుతుంటాడు. ఇక్కడి హనుమంతుడు .. మధ్వమహర్షికి ఫలాన్ని తీకువచ్చినట్టుగా చేతిలో ఫలంతో దర్శనమిస్తూ ఉండటం విశేషం.


More Bhakti News