భక్తుల కుటుంబ బాధ్యత భగవంతుడిదే !
ఎంతోమంది మహాభక్తులు ఆ పాండురంగస్వామి సేవలో తరించారు. స్వామి నామస్మరణలో ... నామసంకీర్తనలో నిద్రాహారాలు మరిచిపోయారు. అలాంటి భక్తులకు వివిధ రూపాల్లో సాయపడటమే కాకుండా, వారి కుటుంబ బాధ్యతను కూడా స్వామివారు స్వీకరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
తన భక్తుల కటుంబసభ్యులకు ఎలాంటి కష్టం కలగకుండా చూసుకున్న సందర్భాలు కూడా మనకి తుకారామ్ వంటి భక్తుల జీవితాల్లో కనిపిస్తాయి. తుకారామ్ భగవంతుడిని ఎంతగా పూజించేవాడో, సాటివారిని అంతగా ఆదరించేవాడు. మానవత్వాన్ని ఉన్నవారికి మాత్రమే భగవంతుడి పాదాలను సమీపించే అర్హతను పొందుతారని చెప్పేవాడు. అలాంటి తుకారామ్ ప్రశాంతతని వెతుక్కుంటూ ఇల్లువిడిచి పోతాడు.
పిల్లలు అతనిపై బెంగపెట్టుకోవడంతో భార్య అతణ్ణి వెతుకుతూ బయలుదేరుతుంది. అలా అడవీమార్గంలో ప్రవేశించిన ఆమె భయపడుతూనే ఒంటరిగా వెళుతూ ఉంటుంది. దారీ తెన్నూ తెలియక ఆమె నానాకష్టాలు పడుతుంటుంది. ఇంటిదగ్గర పిల్లలకు ఎవరూ తోడుగాలేరనే ఆందోళనతో ... భర్తను త్వరగా చేరుకోవాలనే ఆరాటంతో ఆమె పడుతోన్న అవస్థ పాండురంగడి మనసును కదిలించి వేస్తుంది.
దాంతో ఆయన ఒక బాలుడి రూపంలో ఆమెకి తారసపడి, సరైన మార్గంలో ఆమెను తుకారామ్ ఉన్న చోటుకి చేరుస్తాడు. ఇలా పాండురంగడు తన భక్తుల కుటుంబాలను సైతం ఒక కంట కనిపెట్టుకుంటూ ... కాపాడుకుంటూ వచ్చాడు. అనుక్షణం వెన్నంటి ఉంటూ సుఖశాంతులను ... మోక్షాన్ని ప్రసాదిస్తూ వచ్చాడు.