విశేషమైన పుణ్యఫలితాలనిచ్చే కార్తీక పౌర్ణమి

కార్తీకమాసం ఎంతో పవిత్రమైనదిగా ... మరెంతో విశిష్టమైనదిగా చెప్పబడుతోంది. ఈ మాసంలో చేయబడే విష్ణుపూజ ... శివపూజ ... శక్తిపూజ అనంతమైన పుణ్యఫలాలను అందిస్తాయి. తులసిదళాలతో విష్ణుమూర్తినీ ... బిల్వదళాలతో శివుడినీ, ఎర్రని పూలతోను ... కుంకుమతోను అమ్మవారిని పూజించవలసి ఉంటుంది.

ఉదయం వేళలో పూజామందిరంలోను ... తులసి కోటలోను దీపారాధన చేసిన భక్తులు, సాయంత్రం వేళలో ఆలయ దర్శనం చేసి అక్కడ దీపాలు వెలిగిస్తుంటారు. ఉసిరిక దీపాలను వెలిగించి ఉసిరిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇక పూజలతో పాటు అనేక వ్రతాలకు వేదికగా ఈ మాసం కనిపిస్తుంది. ఈ మాసంలో చేయబడే ఒక్కోవ్రతం వలన ఒక్కో ఫలితం దక్కుతుందని చెప్పబడుతోంది.

ఈ మాసంలో అత్యంత విశిష్టతను సంతరించుకున్న 'కార్తీక పౌర్ణమి' రోజున ఆచరించవలసిన వ్రతాలుగా సత్యనారాయణస్వామి వ్రతం ... కేదారేశ్వర వ్రతం ... భక్తేశ్వర వ్రతం కనిపిస్తాయి. ఈ రోజున అన్నదానం ... దీపదానం ... సాలగ్రామ దానం చేయవలసి ఉంటుంది.

కృత్తికా నక్షత్రం నుంచి వచ్చినదే కార్తీకం కనుక, కృత్తికా నక్షత్రంలో జన్మించిన కార్తికేయుడిని ఈ రోజున తప్పక దర్శించవలసి ఉంటుంది. ఇలా కార్తీక పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేసి .. శివ కేశవులను ... శక్తినీ ... కుమారస్వామిని ఆరాధించాలి. వ్రతాలు ఆచరించి దానాలు చేయాలి. ఫలితంగా సమస్త దోషాలు నశించి, ఆయురారోగ్యాలు ... అష్టైశ్వర్యాలు కలుగుతాయి.


More Bhakti News