కార్తీక పౌర్ణమిన కలిగే సత్యవ్రత ఫలితం

భక్తులు పిలిచినదే తడవుగా పలకడంలోను ... కోరిన వరాలను ప్రసాదించడంలోను సత్యనారాయణస్వామి ఎంతమాత్రం ఆలస్యం చేయడు. త్రిమూర్తి స్వరూపమైన ఆ స్వామి రామావతారంలో తన భక్తుడైన 'రత్నాకరుడు'కి ఇచ్చిన మాట కోసమే ఆయన 'అన్నవరం'లోని రత్నగిరిపై ఆవిర్భవించాడు.

భక్తుడికి సంతోషాన్ని కలిగించడం కోసం వైకుంఠం నుంచి వచ్చిన స్వామి, భక్తుల కష్టనష్టాలను తీరుస్తూ సత్యమహిమ కలిగిన దైవంగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. తపస్సుల ద్వారా తప్ప పొందలేని స్వామి అనుగ్రహం, ఆ స్వామి వ్రతాన్ని ఆచరించడం వలన పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

సత్యనారాయణస్వామి వ్రతాన్నే సత్యవ్రతంగా కూడా పిలుస్తుంటారు. ఒకసారి సంకల్పించుకుంటే ఆ స్వామి వ్రతం చేసి తీరవలసిందే. వాయిదా వేయడం వలన అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందనేది ఆ వ్రత కథల్లోనే కనిపిస్తుంది. అంకితభావంతో ... నియమనిష్టలతో ఈ వ్రతం చేసినవారిని స్వామి వెంటనే అనుగ్రహిస్తాడనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి.

సమస్త దోషాల నుంచి ... సమస్యల నుంచి బయటపడేసే ఈ వ్రతాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు. అయితే కార్తీకమాసంలో చేయడం వలన కలిగే ఫలితం విశేషమైనది. ఈ వ్రతాన్ని ఆచరించడానికి 'కార్తీక పౌర్ణమి' మరింత విశేషమైనదిగా చెప్పబడుతోంది. కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణస్వామి వ్రతం చేయడం వలన ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ రోజున ఇటు ఇళ్లలోను ... అటు దేవాలయాల్లో సమూహికంగాను సత్యవ్రతాలు జరుగుతూ ఉంటాయి.

జీవితంలో ఎదురయ్యే అనేక కష్టనష్టాల నుంచి సత్యనారయణస్వామి విముక్తిని కల్పిస్తుంటాడు. అందువలన ఆ స్వామి అనుగ్రహం కోసం ఈ రోజున సత్యవ్రతం ఆచరించాలి. అవకాశం లేని వాళ్లు ఈ రోజున ఆ స్వామి ప్రసాదాన్ని స్వీకరించాలి. సత్యనారాయణ స్వామి వ్రతం ఎక్కడ జరుగుతున్నా ప్రసాదం స్వీకరించకుండా అక్కడి నుంచి వెళ్లకూడదు. స్వామి ప్రసాదాన్ని స్వీకరించడమంటే స్వామి అనుగ్రహాన్ని ప్రత్యక్షంగా పొందడమేననే విషయాన్ని మరిచిపోకూడదు.


More Bhakti News