ఈ రోజున విష్ణుమూర్తి కాశీకి వస్తాడట !

శివకేశవులకు బేధం లేదనే విషయాన్ని పురాణాలు చెబుతున్నాయి. శివుడిని పూజించడం వలన కేశవుడికి ... కేశవుడిని ఆరాధించడం వలన శివుడికి ప్రీతిపాత్రులవుతరనే విషయాన్ని ఎంతోమంది భక్తులు స్పష్టం చేశారు. శైవ క్షేత్రాలకు విష్ణుమూర్తి, వైష్ణవ క్షేత్రాలకు శివుడు క్షేత్రపాలకుడిగా ఉండటం ఒక నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది.

అదే విధంగా హరి నామస్మరణలోని మహాత్మ్యాన్ని శివుడు ... శివ నామస్మరణలోని విశిష్టతను గురించి విష్ణుమూర్తి తెలిపిన సందార్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా శివకేశవుల మధ్య గల అనుబంధానికి నిదర్శనంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఈ విషయాన్ని మరింత స్పష్టం చేసేదిగా కార్తీక శుద్ధ చతుర్దశి కనిపిస్తుంది.

కార్తీక శుద్ధ చతుర్దశి ... 'వైకుంఠ చతుర్దశి' గా చెప్పబడుతోంది. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఈరోజు ఉదయం వేళలో వైకుంఠం నుంచి కాశీ క్షేత్రానికి వెళ్లి విశ్వనాథుడిని పూజిస్తాడట. శివకేశవుల మధ్య గల అనుబంధానికీ ... ఒకరి పట్ల ఒకరు వ్యవహరించే తీరుకి ఇది అద్దంపడుతూ ఉంటుంది. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ... శివుడిని పూజించడానికి వస్తాడనే ఆలోచనే ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ రోజున శివుడిని ఆరాధించడం ఎంతటి విశేషమనేది తెలియజేస్తుంది.

అందువలన వైకుంఠ చతుర్దశి రోజున ఉదయం వేళలో శివాలయాన్ని దర్శించాలనీ ... ప్రదోష వేళలో స్వామివారికి బిల్వదళాలతో పూజాభిషేకాలు నిర్వహించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ రోజున శివాలయంలో దీపారాధనలు ... దీపదానాలు చేయాలి. ఈ విధంగా ఈ రోజున చేసే శివారాధన ఫలితంగా అనంతమైన పుణ్యఫలాలు దక్కుతాయని చెప్పబడుతోంది.


More Bhakti News