లక్ష్మీస్వరూపమైన తులసికి కల్యాణం !
సాధారణంగా భక్తులు ఆయా క్షేత్రాలను దర్శించినప్పుడు అక్కడి ప్రధానదైవమైన స్వామివారికీ .. అమ్మవారికి ప్రత్యేకంగా కల్యాణం జరిపిస్తుంటారు. నిత్యం భక్తుల సందడి ఎక్కువగా ఉండే క్షేత్రాల్లో స్వామివారి కల్యాణాన్ని భక్తులు సామూహికంగా కూర్చుని జరిపిస్తుంటారు. కోరినవి స్వామి అనుగ్రహంతో నెరవేరడం వలన ఇలా కల్యాణం జరిపించేవాళ్లు కొందరైతే, అనుకున్నవి జరిగేలా అనుగ్రహించమని కోరుతూ మరికొందరు కల్యాణం జరిపిస్తుంటారు.
ఇందుకోసం విశేషమైన రోజులను ఎంచుకునేవారు కూడా అధికసంఖ్యలోనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే కార్తీక శుద్ధ ద్వాదశి రోజున లక్ష్మీనారాయణుల కల్యాణం జరిపించడానికి చాలామంది ఆసక్తి చూపుతుంటారు. కార్తీకమాసంలో తులసిపూజ అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడుతోంది. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున లక్ష్మీనారాయణులు తులసికోటయందు నివసిస్తారు.
తులసి ... లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పబడుతోంది కాబట్టి, తులసి రూపంలో గల లక్ష్మీదేవికి ఈ రోజున కల్యాణాన్ని జరిపిస్తుంటారు. ఉసిరిచెట్టు నారాయణ స్వరూపం కనుక ఆ చెట్టుతో లక్ష్మీదేవి స్వరూపమైన తులసిచెట్టుకి కల్యాణం జరిపిస్తుండటం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇలా లక్ష్మీనారాయణులకు కల్యాణం జరిపించడం వలన, స్త్రీలు ప్రాణం కన్నా మిన్నగా భావించే సౌభాగ్యం కలకాలం నిలిచి ఉంటుందని చెప్పబడుతోంది.