ఇంటిముందుకి వచ్చిన దేవుడు !
భక్తుడు ... భగవంతుడి సన్నిధిలో ఉండిపోవాలని కోరుకుంటాడు. భగవంతుడిలో ఐక్యం కావడం కన్నా మించిన అదృష్టం మరొకటి లేదనుకుంటాడు. అందుకోసమే సదా ఆ దైవాన్ని స్మరిస్తూ .. దర్శిస్తూ ... సేవిస్తూ ఉంటాడు. అలా అనునిత్యం దైవారాధనలో తరించి ఆ స్వామిలో ఐక్యమైపోయిన మహాభక్తులు ఎంతోమంది ఉన్నారు.
వాళ్లలో కొంతమందికి సంబంధించిన విశేషాలు ఆ గ్రామ పరిధిలోనే ఉండిపోవడం విచారించదగిన విషయం. అలాంటి వాళ్లలో 18 వ శతాబ్దానికి చెందిన 'మేడూరి నరసింహచార్యులు'ఒకరుగా చెప్పుకోవచ్చు. వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం పరిధిలో 'పెరుమాళ్ల సంకీస' అనే గ్రామం కనిపిస్తుంది. వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన రామాలయం ఇక్కడ దర్శనమిస్తుంది.
18 వ శతాబ్దంలో ఈ ఆలయంలో అర్చకుడైన నరసింహాచార్యులు అత్యంత భక్తిశ్రద్ధలతో రాములవారిని సేవించేవాడట. సీతారాములను అలంకరిస్తూ ... అర్చిస్తూ ... పర్వదినాల్లో ప్రత్యేక సేవలు నిర్వహిస్తూ ఆయన ఆ పారవశ్యంతో సమాధి స్థితిని పొందేవాడు. రాముడి గుణ గణాలను కీర్తించడం ... రామాయణ విశేషాలను గురించి గ్రామస్తులకు చెప్పడంలో ఆయన అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యేవాడు.
అలా సీతారాముల సేవలో తరిస్తోన్న ఆయన తనని వృద్ధాప్యం సమీపించిందనే విషయాన్ని ఆలస్యంగా గుర్తించాడు. తన చివరి క్షణాల్లో ప్రత్యక్ష దర్శనమివ్వమని ఆ సీతారాముడిని ప్రార్ధించాడు. ఒకరోజున వసారాలో కూర్చుని ఉన్న ఆయన తన భార్య రంగమ్మను ఆత్రుతగా పిలిచాడు. విశయమేవిటో అర్థం కాక ఆమె కంగారుగా ఆయన దగ్గరికి వచ్చింది.
సీతారాములు వచ్చారనీ, వెళ్లి చెంబుతో నీళ్లు ... హారతి పళ్లెం పట్టుకు రమ్మని చెప్పాడు. అక్కడామెకి ఎవరూ కనిపించకపోవడంతో, అయోమయానికి లోనవుతూనే వెళ్లి నీళ్లు పట్టుకొచ్చింది. ఆ నీళ్ల చెంబుతో ఆయన మెట్లుదిగి వెళ్లి సీతారాముల పాదాలను కడుగుతున్నట్టుగా చేయడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ఆయన హారతి పళ్లెం అందించమని కోరడంతో .. రెండు మెట్లు దిగి అందించింది. తన ఎదురుగా సీతారాములు ఉన్నట్టుగా ఆయన హారతి ఇచ్చాడు. తనని కరుణించావా ప్రభూ అంటూ ఆయన స్వామివారి పాదాలపై పడినట్టుగా అక్కడ వాలిపోయాడు.
ఆయనకి నిజంగానే సీతారాముల దర్శనం అయిందనీ ... ఆ స్వామిలో ఆయన ఐక్యమైపోయాడని అక్కడివాళ్లు గ్రహించడానికి కొంత సమయం పట్టింది. అలా అనుక్షణం ఆ స్వామి సేవలో తరించిన నరసింహాచార్యులవారి వంశస్తులు ఇప్పటికీ ఇక్కడి ఆలయంలో వంతుదారులుగా స్వామివారి సేవలో తరిస్తున్నారు.