విజయాలను ప్రసాదించే వేంకటేశ్వరుడు

ఎవరైనా సరే జీవితంలో ఎదగడానికే ప్రయత్నిస్తుంటారు ... కష్టమే అయినా అనుకున్నది సాధించడానికి తమవంతు కృషి చేస్తుంటారు. ఎవరికి సంబంధించిన రంగంలో వాళ్లు మరింత ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవడానికి తాపత్రయ పడుతుంటారు.

ఇక కొత్తగా ఇల్లు కట్టుకోవాలని అనుకున్నవాళ్లు ... తమ ఇంట్లో శుభకార్యం జరిపించాలనుకున్నవాళ్లు కూడా ఆ దిశగా తమ ప్రయత్నాలను కొనసాగిస్తుంటారు. ఎవరి మనోభీష్టం ఏదైనా ... ఎవరు ఏ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నా అందుకు భగవంతుడి అనుగ్రహం కూడా ఉండాలని కోరుకుంటారు. ఈ కారణంగానే దేవాలయాలు భక్తులతో సందడిగా కనిపిస్తుంటాయి.

అలా వచ్చిన భక్తుల కోరికలను విని వాళ్ల పనులు విజయవంతమయ్యేలా చేయడంలో భగవంతుడు ప్రధానమైన పాత్రను పోషిస్తుంటాడు. అలా విజయాలను ప్రసాదించే దైవాలలో 'చిన్నాపురం' వేంకటేశ్వరుడు కూడా మనకి కనిపిస్తాడు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం చూడగానే మనసు పవిత్రమై భక్తి భావాలతో వికసిస్తుంది.

ఎంతో చరిత్రను కలిగి ఉన్న ఈ ఆలయం కొంతకాలం క్రితం పునరుద్ధరించబడింది. గర్భాలయంలో వేంకటేశ్వరస్వామి కొలువుదీరి ఉండగా, ఇరువైపులా గల ప్రత్యేక మందిరాలలో రాజ్యలక్ష్మీదేవి ... గోదాదేవి దర్శనమిస్తుంటారు. వేంకటేశ్వరస్వామి ఆలయం ఏ గ్రామంలో అయితే ఉంటుందో ... ఆ గ్రామంలో అక్షయపాత్ర ఉన్నట్టే. ధర్మబద్ధంగా ఎవరికి కావసిన వరాలను వాళ్లు ఆ స్వామివారి నుంచి పొందవచ్చు. ఆ స్వామి కొలువైన చోట వైభవమే కాదు ... భక్తుల పట్ల ఆయనకి గల ప్రేమానురాగాలు కూడా వ్యక్తమవుతూ వుంటాయి.

ప్రతి శుక్ర - శని వారాల్లో ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇక వార్షిక ఉత్సవాలు ... ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు ... సేవలు ఘనంగా జరుగుతుంటాయి. ఈ స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఏ కార్యాన్ని ఆరంభించినా అది విజవంతమవుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. పూజించినవారికి ప్రతిఫలాన్ని ప్రసాదించకుండా ఆ స్వామి ఉండలేడని చెబుతుంటారు.


More Bhakti News