భక్తి మాత్రమే భగవంతుడిని రప్పిస్తుంది
మనసు భగవంతుడికి సంబంధించిన ఆలోచనలతో నిండిపోవాలి. ఆయన రూపమే కనులముందు కదలాడుతూ ఉండాలి. ఆయన నామమే హృదయం నుంచి వెలువడుతూ ఉండాలి. ఆయన సేవచేసుకునే భాగ్యమే తప్ప తనకి మరేమీ అవసరం లేదని చెప్పగలిగే పరిపక్వత రావాలి.
అలాంటి భక్తులు కీర్తిస్తే భగవంతుడు ఎక్కడ ఉన్నా రాకుండా ఉండలేడు. ప్రత్యక్షంగా తన దర్శనభాగ్యాన్ని కల్పించకుండా ఉండలేడు. ఎంతోమంది మహాభక్తుల జీవితంలో జరిగిన సంఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అలాంటి మహాభక్తులలో ఒకరు 'కనకదాసు'.
వేంకటేశ్వరస్వామి అనుగ్రహం కారణంగా జన్మించిన కనకదాసు, యుద్ధవిద్యలు అభ్యసిస్తూ యవ్వనంలోకి అడుగుపెడతాడు. అప్పుడు జరిగిన ఒకానొక సంఘటన ఆయన మనసును 'ఆదికేశవస్వామి' వైపు మళ్లిస్తుంది. ఆ స్వామిపట్ల గల ఆరాధన ఆయనని వ్యాసరాయలవారి ఆశ్రమానికి చేరుస్తుంది. అక్కడ స్థానం లభించడం వలన తన దైవానికి మరింతగా సేవ చేసుకునే భాగ్యం లభిస్తుందని ఆయన ఆనందంతో పొంగిపోతాడు.
ఒక రోజున ఆయన ఆ స్వామిని గురించి పరవశిస్తూ పాడుతుంటాడు. ఆ సమయంలో ఏదో అలికిడి అయినట్టుగా అనిపించడంతో ఆయన ఆ పరవశంలో నుంచి బయటికివస్తాడు. చిన్నికృష్ణుడి రూపంలో వచ్చి తన ఎదురుగా తన పాటకి ఆనందంతో నాట్యం చేస్తున్న ఆదికేశవస్వామిని చూస్తాడు. ఆయన కళ్లు ఆనంద బాష్పాలను వర్షిస్తాయి. తన జన్మ ధన్యమైందంటూ ఆయన స్వామి పాదాలపై వాలిపోతాడు.