సత్యనారాయణస్వామి ప్రసాదం విశేషం !
జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. సుఖశాంతులను అనుభవిస్తోన్నవారిని అష్టకష్టాలు వెతుక్కుంటూ రావచ్చు. అనేక సమస్యలు ఒక్కసారిగా వచ్చి చుట్టుముట్టవచ్చు. అనుకోకుండా ఆపదల్లో చిక్కుకోవచ్చు. ఇలాంటి పరిస్థితులకు పట్టుబడినవాళ్లు వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమైపోతుంటారు. ఏ దైవమైనా తమని గట్టెక్కించకపోతుందా అని ఆశగా ఎదురు చూస్తుంటారు.
ఇలా అనేక ఇబ్బందులను ఒక్కసారిగా అనుభవిస్తోన్నవాళ్లు ... 'సత్యనారాయణస్వామి వ్రతం' చేయడం వలన ఆశించిన ఫలితం కనిపిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. త్రిమూర్తి స్వరూపుడైన సత్యనారాయణస్వామిని పూజించడం వలన, త్రిమూర్తులను ప్రత్యక్షంగా సేవించిన ఫలితం దక్కుతుంది. సాధారణమైన రోజుల్లోను సత్యనారాయణస్వామి వ్రతాన్ని చేసుకోవచ్చు. అయితే కార్తీకమాసంలో ఈ వ్రతాన్ని చేసుకోవడం వలన లభించే ఫలితం విశేషంగా ఉంటుంది.
సిరిసంపదలను ... సంతాన సౌభాగ్యాలను అనుగ్రహించడానికి అనేక వ్రతాలు చెప్పబడ్డాయి. సత్యనారాయణస్వామి వ్రతం మాత్రం ... అనేక సమస్యల నుంచి ... బాధల నుంచి ... కష్టాల నుంచి కాపాడేదిగా, కోరిన శుభాలను కలిగించేదిగా చెప్పబడుతోంది. అందువలన సత్యనారాయణస్వామి వ్రతం మరింత ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది.
ఈ వ్రతంలో ప్రసాదానికి ఎంతో ప్రాధాన్యత ఉండటం విశేషం. అందరూ ఈ వ్రతాన్ని ఆచరించుకోవడానికి వీలుగా ఈ ప్రసాదం గోధుమరవ్వ - పంచదారతో కలిపి తయారు చేయబడుతుంది. ఇక నెయ్యి .. జీడిపప్పు .. యాలకులు .. కిస్ మిస్ జోడించడమనేది వీలునుబట్టి జరుగుతుంటుంది. చాలా తేలికగా తయారుచేయబడే ఈ ప్రసాదం ఎంతో విశేష మైనదిగా చెప్పబడుతోంది.
స్వామి ప్రసాదం పట్ల ఏ మాత్రం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించినా దాని ప్రభావం వెంటనే కనిపిస్తుంది. ఈ వ్రత కథలన్నీ కూడా ఈ ప్రసాద మహిమను గురించే చెబుతుంటాయి. భక్తి శ్రద్ధలతో ఈ ప్రసాదాన్ని స్వీకరించినవాళ్లని సిరిసంపదలు వెతుక్కుంటూ వస్తాయి. ఆయురారోగ్యాలతో ... సుఖశాంతులతో వాళ్ల జీవితం కొనసాగుతుంది. ఇక ఈ ప్రసాదానికి పెద్ద ప్రాముఖ్యత లేదన్నట్టుగా వ్యవహరించినవారి జీవితం కష్టాలపాలవుతుంది. వాళ్లు తమ తప్పు తెలుసుకుని తిరిగి ఈ వ్రతాన్ని ఆచరించే వరకూ ఆ దోషం ప్రభావం చూపుతూనే ఉంటుంది.
ప్రసాదం ఇంతటి విశేషాన్ని కలిగి ఉండటం మనకి సత్యనారాయణస్వామి వ్రతం విషయంలోనే కనిపిస్తుంది. అందుకే అవకాశం కలిగిన వాళ్లు కార్తీకమాసంలో సత్యనారాయణస్వామి వ్రతాన్ని తప్పక ఆచరించాలి. లేదంటే వ్రతం జరిగే ప్రదేశానికి వెళ్లి కథలను శ్రద్ధగా వినాలి. స్వామివారి ప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి. తన ప్రసాదాన్ని ఇష్టంగా స్వీకరించినవాళ్లను సత్యనారాయణస్వామి సదా అనుగ్రహిస్తూనే ఉంటాడు. సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదిస్తూనే ఉంటాడు.