ప్రబోధిని ఏకాదశి రోజున ఏ దానం చేయాలి ?
కార్తీక శుద్ధ ఏకాదశి .. ప్రబోధిని ఏకాదశిగా చెప్పబడుతోంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శయనించిన శ్రీమహావిష్ణువు, ప్రబోధిని ఏకాదశి రోజున యోగనిద్ర నుంచి మేల్కొంటాడు. ఈ కారణంగానే దీనిని 'ఉత్థాన ఏకాదశి' గా కూడా పిలుస్తుంటారు. చాతుర్మాస్య వ్రతం చివరిరోజుగా ఇది చెప్పబడుతోంది.
కార్తీక శుద్ధ ఏకాదశి శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది. అలాంటి ఈ రోజున ఆ స్వామిని పూజించడం వలన పుణ్యరాశి అనంతంగా పెరుగుతుంది. ఫలితంగా ఈ లోకంలోనేకాదు ... పరలోకంలోనూ సుఖశాంతులు లభిస్తాయి. అందువలన ఆ స్వామి అనుగ్రహాన్ని పొందాలనుకునేవాళ్లు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు.
శ్రీమహావిష్ణువు మేల్కొనే రోజు కనుక, ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి ... పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి .. పూజామందిరంలో గల శ్రీమహావిష్ణువు వెండిప్రతిమను అభిషేకించాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సంబంధమైన స్తోత్రాలను ... విష్ణు సహస్ర నామాలను పఠిస్తూ నైవేద్యాలు సమర్పించాలి. ఈ రోజంతా ఉపవాస దీక్షను చేపట్టి ఏకాదశి వ్రతం అనంతరం, ఆ రాత్రంతా స్వామివారి నామసంకీర్తనంతో పరవశిస్తూ జాగరణ చేయవలసి ఉంటుంది.
ఈ రోజున చేసే 'అన్నదానం' వలన విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే ఈ రోజున పండితులకు దక్షిణ తాంబూలాలతో కూడిన 'వస్త్రదానం' చేయడం వలన అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయి. అందువలన కార్తీక శుద్ధ ఏకాదశి అనేది భగవంతుడు ఇచ్చిన అరుదైన అవకాశంగా ... వరంగా భావించాలి. అనుక్షణం ఆ స్వామిని ఆరాధిస్తూ ఆయన సేవలో తరించాలి.