కార్తీక మాసంలో దర్శించవలసిన క్షేత్రం
కార్తీకం శివకేశవులకు అత్యంత ప్రేతికరమైన మాసం. నదీ తీరాల్లో హరిహరులు ఆవిర్భవించిన క్షేత్రాలను ఈ మాసంలో దర్శించుకోవడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. అందువలన భక్తులు హరిహరులు కొలువుదీరిన పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఉంటారు. అలా కార్తీకంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే క్షేత్రాల్లో ఒకటిగా 'కోటిపల్లి' కనిపిస్తుంది.
కోటి ఫలితాలను ఇచ్చే పుణ్యస్థలి కనుక ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలో గౌతమీ నదీ తీరాన విలసిల్లుతోన్న ఈ ప్రాచీన క్షేత్రం మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోంది. సోమేశ్వరుడుగా ... కోటీశ్వరుడుగా పరమశివుడు, జనార్ధనుడుగా శ్రీమహావిష్ణువు ఇక్కడ కొలువైన తీరు ఈ క్షేత్రానికి గల విశిష్టతను ఆవిష్కరిస్తూ ఉంటుంది.
బలిచక్రవర్తి కారణంగా ఎదురైన సమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞతగా, ఇంద్రాది దేవతలు కశ్యప మహర్షిచే ఇక్కడ జనార్ధనస్వామిని ప్రతిష్ఠింపజేశారు. ఇక గౌతమ మహర్షి పెట్టిన శాపం నుంచి విముక్తిని పొందడం కోసం దేవేంద్రుడు ఇక్కడ 'కోటీశ్వర లింగం' ప్రతిష్ఠించగా, గురువుకి చేసిన ద్రోహం నుంచి బయటపడటానికి చంద్రుడు 'సోమేశ్వరలింగం' ప్రతిష్ఠించాడు.
ఈ రకంగా ఈ పుణ్యస్థలిలో మహర్షులు ... దేవతలు తిరుగాడారు. వాళ్ల కారణంగా ఇక్కడ శివకేశవులు కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. హరిహరులు పూజించబడుతోన్న పరమపవిత్రమైన ఈ క్షేత్రంలో అడుగుపెట్టడంతోనే సమస్త దోషాలు నశిస్తాయి ... సకల శుభాలు చేకూరతాయి. ఈ కారణంగానే కార్తీకమాసంలో దర్శించవలసిన శివకేశవుల క్షేత్రాల్లో కోటిపల్లి మరింత ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తూ ఉంటుంది. అనేక పుణ్యఫలితాలను అందిస్తూ ఉంటుంది.