ఇక్కడి స్వామివారి పాదాలను ఆశ్రయిస్తే చాలు
నిత్యజీవితంలో కష్టనష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. ఎవరి స్థాయికి తగిన ఇబ్బందులు వాళ్లు పడుతూనే ఉంటారు. ఒక్కోసారి ఈ కష్టాల నుంచి ఎప్పుడు గట్టెక్కుతామా అని అనుకోవడం జరుగుతూ ఉంటుంది. అంతగా వేధించే కష్టాలు 'కృష్ణా' అనే నామస్మరణతో దూరమవుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
కష్టాలను తొలగించేవాడే కృష్ణుడు అనే విషయాన్నిఎందరో మహాభక్తులు సెలవిచ్చారు. అలాంటి కృష్ణుడు అనేక ప్రాంతాలలో కొలువై భక్తులచే పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. అలా ఆయన కొలువైన క్షేత్రాలలో 'బల్లిపర్రు' ఒకటిగా కనిపిస్తుంది. కృష్ణా జిల్లా పామర్రు మండలంలో ఈ క్షేత్రం అలరారుతోంది.
చాలాకాలం క్రితం నిర్మించబడిన ఈ ఆలయంలో స్వామివారి సౌందర్యాన్ని చూసితీరవలసిందే. సాధారణంగా వేణుగోపాలస్వామి క్షేత్రం అనగానే సంతానాన్ని అనుగ్రహించడం అక్కడి స్వామివారి ప్రత్యేకతగా చెబుతుంటారు. ఇక ఎలాంటి కష్టాలు ఎదురైనా ఆదుకోవడంలో ఇక్కడి వేణుగోపాలుడు ముందుంటాడని అంటారు. అలా అనేక కష్టాల నుంచి స్వామివారి అనుగ్రహంతో బయటపడిన వాళ్ల అనుభవాలు ఇక్కడ వినిపిస్తూ ఉంటాయి.
వేణుగోపాలస్వామి ఆలయంలో కూర్చుని ఆ స్వామి లీల విశేషాలను తలచుకుంటే, అనేక పుణ్యతీర్థాలలో స్నానం చేసిన పుణ్యం ... అనేక యజ్ఞయాగాదులు చేసిన ఫలితం కలుగుతుందని చెప్పబడుతుంది. అలాంటి ఆధ్యాత్మిక వాతావరణమే ఇక్కడ కనిపిస్తుంది. స్వామివారి నామ సంకీర్తనలతోను ... ఆయన లీలావిశేషాల గురించిన ప్రవచనాలతోను ఈ ఆలయం భక్తిభావ పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది.
దాదాపు ఈ గ్రామంలోని ప్రతి ఇంట్లోను ఇక్కడి కృష్ణుడి చిత్రపటం ఉంటుంది. ఆయనకి చెప్పకుండా ఎవరూ ఎలాంటి శుభాకార్యాన్ని ప్రారంభించరు. భక్తుల హృదయాలలో ఇక్కడి వేణుగోపాలుడికి గల స్థానానికి ఇంతకు మించిన నిదర్శనమేముంటుంది ?