శిరిడీసాయి ప్రత్యేకత అదే !
సాయిబాబా సకల దైవస్వరూపమనే విశ్వాసం నానాటికీ పెరుగుతూనే వస్తోంది. ఆయనతో గల అనుబంధాన్ని ఎవరు ఎలాంటి పరిస్థితుల్లోను తెంచుకోలేరు. ఎందుకంటే ఆయన ఎవరినీ ఆకర్షించలేదు ... ఎవరి నుంచి ఏమీ ఆశించలేదు. ప్రేమతోనే అందరి హృదయాలను ఆయన గెలుచుకున్నాడు.
ప్రేమతో కూడిన పలకరింపు .. కరుణతో నిండిన చూపు ... ఇవే సాయిబాబా సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాయి. ఆపదలో ఉన్నప్పుడు తలచుకోగానే తోడుగా నిలిచే ఆయన స్వభావమే భక్తుల హృదయంలో ఆయనకి శాశ్వతమైన స్థానాన్ని కల్పించాయి. అన్నీ తానై నడిపించి తాను నిమిత్తమాత్రుడనని అనడం ఆయనకే సాధ్యమైంది.
భక్తులకు సాయపడే విషయంలో ఇతరులకు ఆ పనిని అప్పగించినట్టే అప్పగించి ఆ పనిని తానే పూర్తి చేయడం బాబాలోని మరో ప్రత్యేకతగా కనిపిస్తుంది. అందుకు 'జామ్నేరు' సంఘటన ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. బాబా భక్తుడైన నానాచందోర్కర్ జామ్నేరులో నివసిస్తుంటాడు. ఆయన కూతురు 'మైనతాయి'కి కాన్పు కష్టం కావడంతో నానాచందోర్కర్ ఆందోళన చెందుతుంటాడు. సమయానికి బాబా విభూతి కూడా అయిపోవడంతో ఆయన బాబాను తలచుకుంటాడు.
అంతలో 'రామగిర్ బువా' అనే వ్యక్తి గుర్రపు బండిలో వచ్చి బాబా పంపించాడంటూ విభూతిని అందిస్తాడు. ఆ విభూతిని నుదుటిపై పెట్టి .. కాస్తంత నీళ్లలో కలిపి తాగించడంతో మైనతాయికి సుఖప్రసవం జరుగుతుంది. అంత రాత్రివేళ ... పైగా హోరున కురుస్తోన్న వర్షంలో అతను టాంగాను మాట్లాడుకుని రావడం నానాచందోర్కర్ కి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తనని పిలిచిమరీ టాంగా ఎక్కించుకున్న కారణంగా దానిని రైల్వేస్టేషన్ కి నానాచదోర్కర్ పంపించి ఉంటాడని రామగిర్ అనుకుంటాడు.
ఈ విషయం ప్రస్తావానికి రావడంతో ఇద్దరూ ఆశ్చర్యపోతూ బయటికివెళ్లి చూస్తారు ... అక్కడ టాంగా ఉండదు. తనకి ఆ పనిని అప్పగించినదీ ... తాను రైలు దిగే సరికి అక్కడ టాంగాతో మారువేషంలో సిద్ధంగా ఉండి ఆ ఊరికి చేర్చినది బాబానే అనే విషయం రామగిర్ బువాకు అర్థమవుతుంది. దాంతో వాళ్లిద్దరూ మనసులోనే ఆయనకి నమస్కరించుకుంటారు. ఇలా తన భక్తులను ఆదుకోవడం కోసం బాబా పడిన ఆరాటమే ఆయన లీలలుగా కనిపిస్తుంటాయి ... పరవశంతో ఆయన పాదాల చెంత కట్టిపడేస్తుంటాయి.