ఇతరుల ధనాన్ని అపహరిస్తే కలిగే ఫలితం
జీవితంలో చాలా అవసరాలు ... విలాసాలు ధనంతోనే ముడిపడి ఉంటాయి. ధనాన్ని కలిగినవాళ్ల అవసరాలు చకచకా తీరిపోతుంటాయి. విలాసాలతో వాళ్ల జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది. పెద్దగా ధనం లేకపోయినా కొంతమంది దానిని గురించి అంతగా ఆలోచించరు.
కష్టం విలువ తెలిసినవాళ్లు తమ అవసరాల పరిధిని తగ్గించుకుంటూ ఉన్నదాంట్లోనే సంతృప్తికరంగా జీవిస్తుంటారు. విలాసాలను గురించిన ఆలోచనే రానీయని కారణంగా వీళ్లలో ఆనందమే తప్ప అసంతృప్తి కనిపించదు. ఇక కొంతమంది తమ ఆర్ధికపరిస్థితి అంతంత మాత్రమేనని తెలిసికూడా విలాసాలకు దూరంగా ఉండలేకపోతుంటారు. కష్టపడటమనే మాట వినడానికే వాళ్లు ఇష్టపడరు.
తాము కోరుకున్న విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడానికి దగ్గర మార్గాలను అన్వేషిస్తారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే వాళ్లు ఇతరుల ధనాన్ని అపహరించడానికి సిద్ధపడతారు. ఒక్కో పాపానికి ఒక్కో ఫలితం ఉండనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇతరుల ధనాన్ని అపహరించినందుకు కూడా తగిన ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది.
ఇతరుల సొమ్ము ఏ రూపంలో ఉన్నా అది లక్ష్మీదేవి స్వరూపంగానే చెప్పబడుతోంది కాబట్టి, అపహరించినవారిని ఆ దోషం వెంటాడుతూ ఉంటుంది. ఆ దోషం కారణంగా వాళ్లు లక్ష్మీదేవి కనికరానికి దూరమవుతారు. అనేక జన్మలపాటు దారిద్ర్యంతో నానాబాధలను అనుభవించవలసి వస్తుంది. అందుకే జీవితంలో ధర్మబద్ధమైన మార్గాన్నే ఎంచుకోవాలని అంటారు. ఇతరుల సొమ్ముకు ఆశపడకుండా కష్టాన్నే నమ్ముకోవాలనీ ... దాని ఫలితాన్నే అనుభవించాలని అంటారు.