భక్తిని కలిగించేది నడిపించేది భగవంతుడే !

శివుడు వేరు ... విష్ణువు వేరు కాదు ... ఇద్దరూ ఒక్కటేననే విషయాన్ని పురాణాలు చెబుతున్నాయి. నిజమైన భక్తుడికి ఇద్దరూ రెండు కళ్లవంటి వాళ్లని అనుభవపూర్వకంగా ఎందరో మహానుభావులు సెలవిస్తున్నారు. లోక కల్యాణం కోసం హరిహరులు తీసుకున్న నిర్ణయాలు ... భక్తుల విషయంలో వాళ్లు వ్యవహరించిన తీరు ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఉంటాయి.

తిన్నడు (కన్నప్ప) దైవాన్ని ఎంతమాత్రం నమ్మేవాడు కాదు. ఆకలి తీరాలంటే కావలసింది కండబలమేనన్న ఆలోచనని కలిగి ఉండేవాడు. ఇక మంజునాథుడు కూడా ఇంచుమించు ఇదే ధోరణిని కనబరుస్తూ ఉండేవాడు. అలాంటివారి అజ్ఞానాన్ని తన లీలావిశేషం ద్వారా తొలగించి తన భక్తులుగా చేసుకుంటాడు ఆ పరమశివుడు.

ఇక ధనమే సర్వస్వమని భావించే పురందరదాసు దానధర్మాలకు దూరంగా ఉండేవాడు. సౌందర్యవతి అయిన భార్యపట్ల గల వ్యామోహంతో దైవ నామస్మరణకి కూడా దూరమవుతాడు తులసీదాసు. అలాంటి వ్యామోహాల నుంచి వాళ్లని బయటపడేసి, భక్తిమార్గంలో నడిపిస్తాడు శ్రీమన్నారాయణుడు. ఇక బాల భక్తులను హరిహరులు అనుగ్రహించిన విధానం కూడా అద్భుతంగా అనిపిస్తుంది.

అల్పాయుష్కుడైన మార్కండేయుడి విషయంలో యమధర్మరాజు వైఖరి పట్ల ఆగ్రహావేశాలను వ్యక్తం చేసిన శివుడు, మార్కండేయుడిని చిరంజీవిగా అనుగ్రహిస్తాడు. ప్రహ్లాదుడి మాటను నిజం చేయడం కోసం ... భగవంతుడు సర్వాంతర్యామి అనే విషయాన్నీ స్పష్టం చేయడం కోసం శ్రీమన్నారాయణుడు ... నరసింహస్వామిగా అవతరించాడు.

అలాగే ధృవుడి తపస్సుకు మెచ్చి అతనికి తండ్రి ప్రేమ లభించేలా చేయడమే కాకుండా, ఆకాశంలో నక్షత్ర స్థానాన్ని అనుగ్రహించాడు. భక్తుల పట్ల హరిహరులు ఎంతటి ఆదరణను కలిగి ఉంటారనడానికి నిదర్శనంగా ఇలాంటి సంఘటనలు అనేకం కనిపిస్తూ ఉంటాయి. భక్తిని కలిగించేది ... భక్తులను నడిపించేది భగవంతుడేననే సత్యాన్ని ఆవిష్కరిస్తూ ఉంటాయి.


More Bhakti News