అమ్మవారి అనుగ్రహాన్ని అందించే దీక్ష
కార్తీకం పరమపవిత్రమైన మాసంగా చెప్పబడుతోంది గనుక, ఈ మాసం దీక్ష ధారణకు విశేషమైనదిగా భావిస్తుంటారు. తమ ఇష్ట దైవాలనుబట్టి అయ్యప్పస్వామి దీక్ష ... వేంకటేశ్వరస్వామి దీక్ష ... హనుమాన్ దీక్ష ... శివ దీక్ష ... భవానీ దీక్ష తీసుకునే భక్తులు ఎక్కువగా కనిపిస్తుంటారు.
శివ దీక్ష చేపట్టేవాళ్లు రుద్రాక్షలను ... వేంకటేశ్వరస్వామి దీక్షను తీసుకునేవాళ్లు తులసి మాలలను ధరిస్తుంటారు. ఇక శక్తిస్వరూపిణిగా చెప్పబడుతోన్న దుర్గాదేవి దీక్ష కూడా ఈ మాసంలో చేపడుతుంటారు. దీనినే భవానీ దీక్షగా చెబుతుంటారు. సాధారణంగా భవానీ దీక్షను 'కార్తీక పౌర్ణమి' రోజున స్వీకరిస్తుంటారు.
ఈ దీక్షను తీసుకున్నవారు ఎరుపురంగు పూసలు గల మాలను ... ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తుంటారు. నుదుటున చందనాన్ని దిద్దుకుంటూ ఉంటారు. అమ్మవారి నామాన్ని స్మరిస్తూ ... రూపాన్ని ధ్యానిస్తూ ... పూజిస్తూ ఉంటారు. దీక్ష తీసుకున్నవారు ఒక బృందంగా ఏర్పడి అమ్మవారి మందిరాన్ని ఏర్పాటు చేసుకుని ఆరాధిస్తారు ... ఆనందంతో భజనలు చేస్తారు.
ఈ దీక్షను సంబంధించిన నియమాలన్నీ కూడా ఇతర దీక్షల మాదిరిగానే ఉంటాయి. భవానీ దీక్షను తీసుకున్నవాళ్లు ముందుగా అనుకున్న ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మవారిని దర్శించి దీక్ష విరమణ చేస్తుంటారు. అందుకు అవకాశం లేని వాళ్లు దగ్గరలో గల అమ్మవారి ఆలయాల్లో దీక్ష విరమిస్తుంటారు. అమ్మవారి దీక్ష తీకున్న భక్తులు ఆ తల్లి అనుగ్రహం తమపై ఎల్లప్పుడూ ఉంటుందని విశ్వసిస్తుంటారు. అనునిత్యం ఆ తల్లి సేవలో తరించాలని ఆరాటపడుతుంటారు.