దర్శనమాత్రంచేత ధన్యులను చేసే శివలింగం !

సహజంగానే కార్తీకమాసంలో శివాలయాలు భక్తులతో సందడిగా కనిపిస్తూ ఉంటాయి. ఇక స్వయంభువు క్షేత్రాలను దర్శించడం వలన మరింత ఫలితం లభిస్తుందనే ఉద్దేశంతో చాలామంది దగ్గరలోని క్షేత్రాలకి వెళుతూ ఉంటారు .. పూజాభిషేకాలను జరిపిస్తూ ఉంటారు.

ఈ నేపథ్యంలో గర్భాలయంలో కాకుండా ఆరుబయటే దర్శనమిస్తూ భక్తులచే పూజాభిషేకాలు అందుకునే స్వయంభువు శివలింగం ఒకటి మనకి 'రావివలస'లో దర్శనమిస్తుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి దగ్గరలో ఈ గ్రామం కనిపిస్తుంది. రావిచెట్టుకింద శివుడు వెలసిన కారణంగానే ఈ గ్రామానికి 'రావి వలస' అనే పేరు వచ్చిందట. తల పైకెత్తి చూసేంత ఎత్తులో కనిపించే ఈ స్వయంభువు శివలింగం కృతయుగం నుంచే ఇక్కడ పూజలు అందుకుంటునట్టుగా చెప్పబడుతోంది.

ఆయా కాలాల్లో గల భక్తులు ఈ భారీ శివలింగానికి ఆలయాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తే, స్వప్నంలో ఆదిదేవుడు కనిపించి ఆరుబయట ఉండటమే తనకి ఇష్టమని చెప్పాడట. ఆ తరువాత కాలంలో శివలింగం చుట్టూ వేదిక ... అభిషేకానికి వీలుగా పైకప్పులేని రెండు అంతస్తుల నిర్మాణం జరిగింది. చుట్టూ గోడలు లేకుండా శివలింగం అందరికీ కనిపిస్తూనే ఉంటుంది.

ఇక్కడికి సమీపంలో ఒక కొలను కనిపిస్తుంది. సీతారామలక్ష్మణులు ఈ కొలనులో స్నానం చేసి ఈ శివలింగాన్ని పూజించారట. ఈ కారణంగా ఈ కొలను 'సీతా కుండం' పేరుతో పిలవబడుతోంది. కార్తీక మాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ సందర్భంగా దూరప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి స్వామి మహిమాన్వితుడనీ ... కోరిన వరాలను ప్రసాదిస్తూ ఉంటాడని చెబుతుంటారు. మహాశివలింగాన్నికనులారా దర్శిస్తుంటారు ... మనసారా కొలుస్తుంటారు.


More Bhakti News