అక్షయ నవమి రోజున ఎవరిని ఆరాధించాలి ?
కార్తీక శుద్ధ నవమి 'అక్షయ నవమి' గా చెప్పబడుతోంది. ఈ రోజున 'అక్షయ నవమి' వ్రతాన్ని ఆచరించడం వలన పుణ్యరాశి పెరుగుతుందనీ, సకల సంపదలు చేకూరతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. 'కూష్మాండుడు' అనే రాక్షసుడిని లోక కల్యాణం కోసం శ్రీమహావిష్ణువు సంహరించిన రోజు ఇది. ఇక ఈ రోజునే 'కృతయుగం' ఆరంభమైన రోజుగా చెప్పబడుతోంది.
ఈ రోజున శ్రీమహావిష్ణువును ఆరాధించవలసి వుంటుంది. ప్రతి యుగంలోనూ లోక కంటకులు ఆవిర్భవిస్తూనే ఉన్నారు ... సాధు సజ్జనులను అనేక విధాలుగా హింసిస్తూనే వున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ శ్రీమన్నారాయణుడు ఆపద్బాధవుడై ఆదుకుంటూనే వున్నాడు. ఈ నేపథ్యంలోనే శ్రీమహావిష్ణువు వివిధ రకాల అవతారాలను ధరించాడు. దుష్ట శిక్షణ ... శిష్ట రక్షణ చేస్తూ వచ్చాడు. అలా భగవంతుడిని తమ బంధువుగా భావించేవారికి 'కూష్మాండుడు' బారి నుంచి విముక్తి కల్పించిన రోజుగా ఇది చెప్పబడుతోంది.
ఈ సందర్భంగా లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడిని షోడశ ఉపచారాలతో పూజించడం వలన కలిగే పుణ్యఫలితం అక్షయమవుతుంది. ఈ రోజున లక్ష్మీ నారాయణులను భక్తి శ్రద్ధలతో సేవించడం వలన సమస్యలు దూరమవుతాయి ... కష్టాలు కనుమరుగవుతాయి. లక్ష్మీనారాయణులకు పాయసం ప్రీతికరమైన నైవేద్యంగా చెప్పబడుతోంది. అందువలన ఈ రోజున పాయసాన్ని నైవేద్యంగా సమర్పించడం వలన శుభాలు ... సంపదలు కలుగుతాయి.