అందరి బంధువు ఆదిదేవుడు

ఎన్నో జన్మలుగా అనుభవిస్తూ వస్తోన్న పాపాల ఫలితాల నుంచి విముక్తిని కలిగించడంలో కార్తీకమాసం ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. ముందు జన్మలకి అవసరమైన పుణ్యఫలాలను రాశులుగా అందిస్తుంది. ఎందుకంటే ఇది పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఆయన మనసును మరింత తేలికగా గెలుచుకునే అవకాశం.

అందుకే పరమశివుడికి పరమ సంతోషాన్ని కలిగించడానికి భక్తులు ఆయనకి ఈ మాసమంతా మరింత భక్తిశ్రద్ధలతో పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. అలా భక్తులచే సేవలందుకునే 'రామలింగేశ్వరుడు' మనకి 'తుమ్మలపల్లి' లో దర్శనమిస్తూ ఉంటాడు. నల్గొండ జిల్లా చండూరు మండలం పరిధిలో ఈ క్షేత్రం కనిపిస్తుంది.

ప్రాచీనతను కలిగివున్న ఈ క్షేత్రం, ప్రశాంతతకు నిలయంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందరో మహానుభావులు ఇక్కడి స్వామివారిని సేవించి తరించినట్టు చెబుతారు. ఈ గ్రామంలోని వాళ్లంతా శివయ్యని తమ దగ్గరి బంధువుగా భావిస్తూ ఉంటారు. తమ ఇంటి వేడుకలకి ఆయనని ఆహ్వానించడమే కాదు, స్వామి ఆలయంలో జరిగే వేడుకలకి ముందుంటారు.

స్వామివారిని మనస్ఫూర్తిగా సేవిస్తూ ఉండేవాళ్లు ఎందరో అనారోగ్యాల నుంచి ... ఆపదల నుంచి బయటపడినట్లు చెబుతారు. తమ వెన్నంటి ఉంటూ కాపాడేది ఆ సదాశివుడేనని అంటారు. కార్తీకమాసంలో ఉపవాస దీక్షను చేపట్టి ఇక్కడ ఉసిరిక దీపాలు వెలిగిస్తారు ... స్వామివారి దర్శనమే సకల శుభాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తుంటారు.


More Bhakti News