గోవును ఈ రోజున పూజించాలి

భూదేవికి సహనం ఎక్కువ ... ఎలాంటి కష్టమైనా ఆమె సహనంతో భరిస్తుందే తప్ప బయటికి చెప్పుకోదు. ఇక పాపాలు చేసే వాళ్లు అంతకంతకూ ఎక్కువై పోతుంటే, వాళ్లను భరించలేని భూదేవి అప్పుడు తన కష్టాన్ని చెప్పుకోవడానికి శ్రీమహావిష్ణువు దగ్గరికి 'గోవు' రూపంలో వెళుతుందట. ఎందుకంటే ఎంత తీరిక లేకుండా వున్నా ముందుగా గోవు కష్టాన్ని తీర్చడానికి ఆ స్వామి ఆత్రుత పడతాడట.

అందుకే తన కష్టాన్ని స్వామికి విన్నవించాలని భూదేవి అనుకున్నప్పుడు గోవు రూపంలో ఆయన సన్నిధికి వెళుతుందట. దీనిని బట్టి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు గోవుకి ఇచ్చే స్థానం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి గోవు ... సాధుజీవిగా మానవాళి మనుగడకు ఎంతగానో సహకరిస్తోంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో గోవు పాలు ... పెరుగు ... నెయ్యి .. గోవు మూత్రం ... గోమయం ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉన్నాయంటే, గోవు ఎంతటి పవిత్రమైనదో తెలుస్తోంది.

గోవును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజిస్తూ ఉండటం కొన్ని విశేషమైన రోజుల్లో జరుగుతూ ఉంటుంది. అలాంటి విశేషమైన రోజుల్లో ఒకటిగా 'కార్తీక శుద్ధ అష్టమి' కనిపిస్తుంది. దీనినే 'గోష్ఠాష్టమి' అని అంటూ వుంటారు. ఈ రోజు ఉదయాన్నే స్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి పూజా మందిరంలో శ్రీకృష్ణుడి ప్రతిమను షోడశ ఉపచారాలతో సేవించాలి.

ఆ తరువాత గోశాలలో గల గోవును అలంకరించి, ప్రదక్షిణలు చేసి పూజించాలి. కొంతమంది మరింత భక్తిశ్రద్ధలతో ఈ రోజున గోష్ఠాష్టమి వ్రతాన్ని కూడా ఆచరిస్తుంటారు. గోవు లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పబడుతోంది కనుక, గోవును పూజించడం వలన ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది. సిరిసంపదలకు ... పాడిపంటలకు కొదవనేది ఉండదని చెప్పబడుతోంది.


More Bhakti News