కార్తీకమాసంలో భోజన నియమం
కార్తీక మాసం నియమాల తోరణంలా ... అనేక విశేషాల సమాహారంలా కనిపిస్తూ ఉంటుంది. ఒక్కోరోజు ఒక్కో విశిష్టతను సంతరించుకున్న కారణంగా ప్రతినిత్యం శివాలయాలు ... వైష్ణవ ఆలయాలు ... శక్తి ఆలయాలు భక్తులతో సందడిగా కనిపిస్తూ ఉంటాయి.
ఈ మాసంలో స్నాన .. దాన ... జపాలు విశేష ఫలితాలు ఇస్తాయని చెప్పబడుతోన్న కారణంగా భక్తులు వాటిపై పూర్తిగా మనసు పెడుతుంటారు. శివ భక్తులు రుద్రాక్ష మాలలను ధరించి ... వైష్ణవ భక్తులు తులసి మాలలు ధరించి దీక్షను చేపడుతుంటారు.
ఇంట్లో గల తులసికోట చెంత దీపారాధన చేసి ప్రదక్షిణలు చేస్తుంటారు. అదే విధంగా ఆలయాలకి వెళ్లి అక్కడి ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేసి పూజిస్తూ ఉంటారు. సూర్యాస్తమయం తరువాత ఆలయాల్లో ధ్వజ స్తంభం పైభాగాన వేలాడే 'ఆకాశ దీపం' దర్శిస్తూ ఉంటారు. ఆకాశ దీపాన్ని దర్శించి నమస్కరించడం వలన జన్మజన్మల పాపాలు పటాపంచలు అవుతాయని చెప్పబడుతోంది.
ఇరుగుపొరుగు వాళ్లంతా కలిసి దగ్గరలోని వనాలకి వెళ్లి అక్కడ భోజనాలు చేసి వస్తుంటారు. వీటినే 'వనభోజనాలు' అని అంటూ ఉంటారు. వనభోజనాలు ఆనందాన్నీ ... ఆరోగ్యాన్ని కలిగించడమే కాదు, అనేక దోషాల నుంచి విముక్తిని కల్పిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో భోజనానికి ఉపయోగించే వస్తువులు ... వంట పదార్థాల విషయంలోనూ కొన్ని నియమాలు కనిపిస్తాయి.
ఈ మాసమంతా కూడా ఉల్లి .. వెల్లుల్లి .. నువ్వులు .. వంకాయ .. గుమ్మడికాయతో చేయబడిన పదార్థాలను స్వీకరించకూడదు. అలాగే భోజనాలు చేయడానికి గాను లోహ సంబంధమైన కంచాలు ఉపయోగించ కూడదనేది ఒక నియమంగా కనిపిస్తుంది. ఈ మాసంలో 'మోదుగు ఆకు' లో భోజనం చేయడమే శ్రేష్టమని శాస్త్రం చెబుతోంది. మోదుగు ఆకులో భోజనం చేయడం వలన అనంతమైన పుణ్యఫలాలు వచ్చి చేరతాయని స్పష్టం చేయబడుతోంది.
తలస్నానం ... తులసి - ఉసిరిచెట్ల చుట్టూ ప్రదక్షిణలు ... దీపారాధనలు ... ఉపవాసాలు ... వనభోజనాలు ... కొన్ని పదార్థాలకు దూరంగా ఉండటం ... మోదుగ ఆకుల్లో మాత్రమే భోజనం చేయడం ఇవన్నీ ఆచరించవలసిన నియమాలుగా కనిపిస్తాయి. ఆధ్యాత్మికతతో ముడిపడిన ఈ నియమాలన్నీ కూడా ఆరోగ్య సంబంధమైనవి కావడం విశేషం.