దాడిచేయబోతే దయచూపిన స్వామి
కార్తీకమాసం ప్రారంభం కాగానే అయ్యప్పస్వామి దీక్షధారణ మొదలవుతుంది. ఈ మాసంలో మాలధారణ చేసిన భక్తులు తాము అనుకున్న ప్రకారం శబరిమల యాత్ర చేసి వస్తుంటారు. శబరిమల వెళ్లిన భక్తులు ముందుగా 'వావరు స్వామి' దర్శనం చేసుకుని ఆ తరువాత స్వామి సన్నిధానానికి వెళుతూ వుంటారు. పదునెట్టాంబడి సమీపంలోనే వావరు స్వామి సన్నిధి దర్శనమిస్తుంది.
వావరు .. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రుడు కావడానికీ, ఆయన సన్నిధానంలో తాను కూడా పూజలు అందుకోవడానికి వెనుక ఒక ఆసక్తికరమైన కథ వుందని చెబుతుంటారు. అడవీ మార్గంలో ప్రయాణం చేస్తున్నవాళ్లపై వావరు ఆయుధాలతో దాడిచేసి, వాళ్ల దగ్గరున్న సొమ్మును దోచుకుంటూ ఉండేవాడు. ఎవరికి వారు ప్రాణాలతో బయటడటమే అదృష్టంగా భావిస్తూ ఉండటంతో, ఆయన జీవితం హాయిగా గడిచిపోసాగింది.
అలాంటి పరిస్థితుల్లోనే పులిపాల కోసం అన్వేషిస్తూ మణికంఠుడు అటుగా వస్తాడు. ఒక్కసారిగా స్వామి ముందుకి దూకిన వావరు, దగ్గరున్న సొమ్మంతా ఇవ్వమంటూ భయపెడతాడు. మణికంఠుడు ఎంతమాత్రం బెదరకపోవడంతో, మరింత కోపంగా ఆయనవైపు చూస్తాడు. ప్రశాంతమైన మణికంఠుడి చూపులు సోకగానే వావరులో అనూహ్యమైన మార్పువస్తుంది. ఆయనలోని అజ్ఞానం నశించి జ్ఞానజ్యోతి వెలుగుతుంది.
దాంతో వావరు తన ఆయుధాలను అక్కడే వదిలేసి అనుగ్రహించమని కోరతాడు. స్వామి సేవలో తరించే భాగ్యాన్ని ప్రసాదించవలసినదిగా వేడుకుంటాడు. ఇక మీదట అతను పోషించే పాత్ర చాలా కీలకమైనదంటూ వావరును అనుగ్రహిస్తాడు మణికంఠుడు. అతని సేవల కారణంగా శబరిమల క్షేత్రంలో ప్రత్యేకమైన స్థానం లభిస్తుందని చెబుతాడు. తన కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ముందుగా ఆయనకి నమస్కరించి, ఆ తరువాత తన దర్శనం చేసుకుంటారని అంటాడు.
అలా మణికంఠుడు వావరుస్వామికి వరాన్ని ప్రసాదిస్తాడు. ఆనాటి నుంచి అదే పద్ధతి ఇక్కడ కొనసాగుతూ వస్తోంది. అసమానమైన భక్తి ... అచెంచలమైన విశ్వాసం కనబరిస్తే దైవానుగ్రహానికి ఎవరైనా పాత్రులు కావొచ్చనడానికి నిలువెత్తు నిదర్శనంగా వావరుస్వామి చరిత్ర కనిపిస్తూ ఉంటుంది.