వీరభద్రుడి ఆయుధం ఇక్కడ పడిందట !
వీరభద్రుడు ఆవిర్భవించిన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాల్లో 'పట్టిసాచలం' ఒకటిగా చెప్పబడుతోంది. గోదావరి అక్కున చేర్చుకున్నట్టుగా కనిపించే ఈ క్షేత్రాన్ని 'పట్టిసం'గా పిలుస్తుంటారు. సాధారణంగా ఎవరైనా ఏదైనా క్షేత్రానికి వెళ్లినప్పుడు ఆ క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చిందనే సందేహం కలుగుతూ ఉంటుంది.
అలాంటి సందేహమే ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు ... ఈ క్షేత్రాన్ని గురించి విన్నప్పుడు తలెత్తుతూ ఉంటుంది. స్థలపురాణంపై దృష్టిపెడితే, 'పట్టిసం' అనే ఆయుధం నేపథ్యంగా ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చినట్టు తెలుస్తుంది. ఒకసారి సతీదేవి ఆహ్వానం లేకపోయినా, తన తండ్రి దక్షుడు తలపెట్టిన యాగానికి వెళ్లి అవమానం పాలవుతుంది.
అవమానంతో భర్త దగ్గరికి తిరిగి వెళ్లలేక ఆత్మత్యాగం చేస్తుంది. దాంతో ఆగ్రహించిన శివుడు ... వీరభద్రుడిని సృష్టించి, దక్షుడిని సంహరించవలసిందిగా ఆదేశిస్తాడు. వీరభద్రుడు 'పట్టిసం' అనే ఆయుధం విసరడం వలన దక్షుడి తల తెగిపడుతుంది. పట్టిసం అనే ఆ ఆయుధం 'దేవకూట పర్వతం' పై పడుతుంది. పట్టిసం పడిన ప్రదేశం కాబట్టి 'పట్టిసాచలం'గా ప్రసిద్ధి చెందింది. అలా ఈ క్షేత్రం పట్టిసంగా పిలవబడుతోంది.
విజయోత్సాహంతో ఈ కొండపై తాండవం చేసిన వీరభద్రుడు మహర్షుల కోరిక మేరకు శాంతించి, వీరేశ్వరుడుగా భద్రకాళీ సమేతుడై ఇక్కడ లింగరూపంలో ఆవిర్భవించాడు. అశేష భక్తజనులచే పూజాభిషేకాలు అందుకుంటూ అనుగ్రహిస్తున్నాడు. కార్తీకమాసంలో దర్శించుకోవలసిన పరమపవిత్రమైన శైవక్షేత్రాల్లో ఇది ఒకటిగా చెప్పబడుతోంది.