ఆయురారోగ్యాలను అందించే నాగపంచమి
కార్తీక శుద్ధ పంచమి ... నాగపంచమిగా చెప్పబడుతోంది. నాగుల చవితి రోజున నాగదేవతను పూజించినవారంతా నాగపంచమి రోజున కూడా నాగదేవతను ఆరాధిస్తూ వుంటారు. సర్పాలు భయంకరమైన విషాన్ని కలిగివుంటాయి. అయితే తమకు తాముగా అవి ఎవరికీ హాని చేయవు. తమని తాము రక్షించుకోవడం కోసమే వాటికి భగవంతుడు ఆ విధమైన ఏర్పాటు చేశాడు.
కైలాసంలో పరమశివుడినీ ... వైకుంఠంలో శ్రీమహావిష్ణువును సేవిస్తూ ఉండే సర్పజాతి, కొన్ని విషయాల్లో మానవాళి మనుగడకు తోడ్పడుతూ వస్తోంది. ఈ కారణంగానే వాటిపట్ల కృతజ్ఞతా పూర్వకంగా పూజిస్తూ ఉండటం అనాదిగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు వైష్ణవ సంబంధమైన ఆలయాల్లోను ... అటు శైవ సంబంధమైన ఆలయాలలోను నాగేంద్రుడు కొలువుదీరి కనిపిస్తూ ఉంటాడు. భక్తుల కోరికలను తెలుసుకుంటూ వాటిని నెరవేరుస్తూ ఉంటాడు.
సాధారణంగా సంతానలేమితో బాధలుపడుతోన్నవాళ్లు ... గ్రహ సంబంధమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్లు నాగారాధన చేస్తుంటారు. ముఖ్యంగా నాగులచవితి ... నాగపంచమి రోజుల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో నాగపూజ చేస్తుంటారు. నాగుల చవితి రోజున ఉపవాస దీక్షను చేపట్టిన వాళ్లు .. నాగపంచమి రోజున ఉపవాస దీక్షను విరమిస్తారు.
ఈ రోజున .. సర్పరూపంలో గల సుబ్రహ్మణ్యస్వామిని పూజించి, బ్రాహ్మణుడికి 'స్వయంపాకం' ఇవ్వాలని చెప్పబడుతోంది. ఈ రోజున నాగపూజ చేసినవారికి వివాహయోగం .. సంతాన భాగ్యం కలగడమే కాకుండా పేరు ప్రతిష్ఠలను పొందుతారనే విషయం ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తుంది. నాగదేవత అనుగ్రహం కారణంగా అనారోగ్యాలు తొలగిపోయి ఆయురారోగ్యాలు చేకూరతాయని చెప్పబడుతోంది.