కార్తీకమాసంలో గృహనిర్మాణం !
పల్లెటూరైనా ... పట్టణమైనా అక్కడ సొంత ఇల్లు అనేది ఉన్నప్పుడే ఆ ఊరు తమదని చెప్పుకునే అవకాశం ఉంటుంది. సొంత ఇల్లు లేకుండా ఈ ఊరు మాది అని చెప్పుకోవడానికి మనసు అంగీకరించదు. అందుకే ప్రతి ఒక్కరూ తాము తల దాచుకోవడానికి సొంత ఇల్లు అనేది ఉండాలని అనుకుంటారు. అందుకోసం అనేక ప్రయత్నాలను చేస్తారు ... ఎన్ని కష్టాలనైనా ఎదుర్కుంటారు.
ఇల్లు కట్టుకున్నాక మనసు ఇతర విషయాల వైపు మళ్లవచ్చు. కానీ అంతకుముందు మాత్రం సొంతగూడు ఏర్పాటు చేసుకోవాలనే కోరిక మాత్రమే ప్రధానమైనదిగా కనిపిస్తుంది. ఇంటిని నిలబెట్టడమనేది స్వశక్తిపై ఆధారపడి వుంటుంది కనుక, నిర్మాణం ఆరంభించే ముందు ప్రతిఒక్కరూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వుంటారు.
ఒకసారి పని ప్రారంభించిన తరువాత, మధ్యలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉండాలని ఆశిస్తారు. నిర్మాణం పూర్తి చేసుకున్న తరువాత ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా అందులో మనశ్శాంతిగా నివసించాలని అనుకుంటారు. ఇంటి విషయంలో ఏదైతే కోరుకుంటూ వుంటారో అది నెరవేరాలంటే దాని నిర్మాణాన్ని కార్తీకమాసంలో ఆరంభించాలని చెప్పబడుతోంది.
కార్తీకమాసంలో నిర్మాణాన్ని జరుపుకున్న ఇంటిలో ధనధాన్యాలకు కొదవ ఉండదు. కాబట్టి సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలని అనుకునే వాళ్లు, కార్తీకమాసంలో అందుకు సంబంధించిన ప్రయత్నాలను ఆరంభించడం మంచిది. అందువలన ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందని స్పష్టం చేయబడుతోంది.