ఆపదలో ఆదుకునే ఆదిదేవుడు
నల్గొండ జిల్లా పరిధిలో ఎన్నో ప్రాచీన శైవక్షేత్రాలు అలరారుతూ కనిపిస్తూ వుంటాయి. అందులో కొన్ని కాకతీయుల కాలంనాటివి కాగా, మిగతావి అంతకుముందు కాలానికి సంబంధించినవిగా చెప్పబడుతున్నాయి.
దేవతలు తమ సంకల్పం నెరవేరడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా కొన్ని శివాలయాలు, లోక కల్యాణం కోసం మహర్షుల అభ్యర్థన మేరకు స్వామివారు ఆవిర్భవించిన ప్రదేశాలు మరికొన్ని కనిపిస్తాయి. అలాంటి ప్రాచీన క్షేత్రాల్లో ఒకటి 'సంస్థాన్ నారాయణ పురం' పరిధిలో విలసిల్లుతోంది.
నల్గొండ జిల్లాలో గల ఈ గ్రామం పరిధిలో 'రాచకొండ గుట్టలు' దర్శనమిస్తాయి. ఇక్కడే ప్రాచీనకాలం నాటి శివాలయం మనకి కనిపిస్తుంది. ఈ ప్రదేశంలో అడుగుపెట్టగానే ... ఇది అత్యంత పురాతనమైన క్షేత్రమని తెలిసిపోతుంది. ఎంతోమంది రాజులు ... సంస్థానాధీశులు ఇక్కడి స్వామిని సేవించి తరించారట. మరెంతోమంది సాధువులు ఇక్కడి స్వామిని పూజించి అష్టసిద్ధులను పొందారట.
శివయ్యను మనసారా పూజించినవారి కుటుంబాలను ఆయన కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడని చెబుతుంటారు. ఆపదలో తలచుకుంటేచాలు ఏదో ఒక రూపంలో వెంటనే వచ్చి ఆదుకుంటాడని అంటారు. ఆసక్తికరంగా అనిపించే అలాంటి అనుభవాలు ఎన్నో ఇక్కడ వినిపిస్తూ వుంటాయి. కార్తీకమాసంలో ఇక్కడి శివయ్యను భక్తులు దర్శించుకుంటూ వుంటారు. స్వామివారికి పూజాభిషేకాలు జరిపించి .. ఆయన ఆశీస్సులు అందుకుంటూ ఉంటారు.